సంతనూతలపాడు.. వైసీపీకి చిక్కడం కష్టమేనా.. ?
దీని ద్వారా గ్రామంలో పరిశుభ్రత, రోడ్ల క్లీనింగ్, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.మౌలిక సదుపాయాల మెరుగుపరుస్తున్నారు.
By: Garuda Media | 16 May 2026 3:25 PM ISTఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గం సంతనూతలపాడు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయ్‌కుమార్.. టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. తొలిసారి విజయం దక్కించుకున్న నేపథ్యంలో బలమైన వైసీపీ వర్గాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారా? అనేది సందేహంగా మారింది. అంతేకాదు.. కీలకమైన ఈ నియోజకవర్గంలో పాగా వేయడం కూడా కష్టమేనని అనుకున్నారు.
కానీ, విజయ్‌కుమార్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధిని ప్రామాణికంగా చేసుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు. అన్ని వర్గాలను ఆయన చేరదీస్తున్న విధానం మంత్రముగ్ధులను చేస్తోంది. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. సంతనూతలపాడు గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామం/పంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'స్వచ్ఛ పథం' కార్యక్రమం చేపట్టారు.
దీని ద్వారా గ్రామంలో పరిశుభ్రత, రోడ్ల క్లీనింగ్, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.మౌలిక సదుపాయాల మెరుగుపరుస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నా రు. దీనివల్ల రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, పరిశుభ్రత పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. ఇక, ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న .. ప్రజా దర్బార్ నిర్వహించడం.. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఎమ్మెల్యే విజయ్ కుమార్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామీణ ఓటర్లను ఆకర్సించేలా.. ఆయా ప్రాంతాలలో పశువుల ఆరోగ్యం కోసం ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.సాంస్కృతిక మరియు మతపరమైన అంశాలను కూడా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఎవరినీ నొప్పించకుండా పనులు చేయడంతో విజయ్‌కుమార్ వ్యూహం ఫలిస్తోంది. ఈతరహా వ్యూహాన్ని మరో ఏడాదిన్నరపాటు అమలు చేస్తే. ఇక్కడ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేనన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.
