ఎమ్మెల్యేల ఎఫెక్ట్: 'అసలు' సమస్యకు మందేది బాబూ!
క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతోంది. వాస్తవానికి గత ఏడాది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యేలపై అనేక విమర్శలు, వివాదాలు తెరమీదికి వచ్చాయి.
By: Garuda Media | 4 Oct 2025 4:00 PM ISTక్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతోంది. వాస్తవానికి గత ఏడాది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యేలపై అనేక విమర్శలు, వివాదాలు తెరమీదికి వచ్చాయి. అప్పట్లో నేరుగా చంద్రబాబు స్పందించారు. అనేక మందికి క్లాసిచ్చారు. అయినా.. అప్పటికి సరే అంటూ.. తలలూపిన నాయకులు తర్వాత మళ్లీ తమ బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యే లు రెచ్చిపోయారు. ఫలితంగా కూటమిపైనే ప్రభావం పడింది.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇది నిజం. అందుకే.. చంద్రబాబు స్వయంగా ఇప్పుడు మరోసారి కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రులతో విడివిడిగా-కలివిడిగా చర్చించారు. మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఇది `తాంబూలాలిచ్చేశాం.. `అన్నట్టుగానే ఉంది తప్ప.. అసలు సమస్యకు ఎక్కడా మందు కనుగొన్న పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అసలు ఎమ్మెల్యేలకు.. క్షేత్రస్థాయిలో మంత్రులకే పడడం లేదు. ఇది నిష్ఠుర సత్యం.
ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సదరు మంత్రులు ఆధిపత్య ధోరణిని ప్రదర్శి స్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు.. తమకు కూడా `వాటాలు` కావాలని పట్టుబ డుతున్నవారు ఉన్నారని అనే వారు కనిపిస్తున్నారు. ఇది.. మంత్రులకు-ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెంచేసింది. ఫలితంగా ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించడం కూడా మానేశారు.
ఒకరిద్దరు బీసీ జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత, టీజీ భరత్ వంటివారు జిల్లాలకు వెళ్లినా.. వారిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే పట్టించుకోవడం మానేశారు. దీంతో మంత్రులకు ఎమ్మెల్యేలకు దూరం పెరిగింది. మరి ఈ విషయం చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడు అదే ఎమ్మె ల్యేలను దారిలో పెట్టాలంటూ.. చంద్రబాబు మంత్రులకు సూచించారు. కానీ, క్షేత్రస్థాయిలో బలమైన ఎమ్మెల్యేల ధాటికి మంత్రులే.. మౌనంగా ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఇక్కడ మంత్రుల తప్పు కూడా ఉంది. ఎమ్మెల్యేలు చెప్పిన పనులను వారు చేయడం మానేసి.. వారికి నచ్చిన అజెండాను అమలు చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏదేమైనా.. అసలు ఈ సమస్యకు మందు చూపించకుండా.. అన్నీ చక్కదిద్దే బాధ్యత నుంచి బాబు తప్పుకోవడం సరికాదన్నది ప్రధాన వాదన.
