Begin typing your search above and press return to search.

కొలికపూడి హాట్ పోస్ట్ : లిక్కర్ సిండికేట్‌ అంటూ సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఫైర్!

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి హాట్ పోస్టు చేశారు.

By:  Tupaki Political Desk   |   25 March 2026 5:35 PM IST
కొలికపూడి హాట్ పోస్ట్ : లిక్కర్ సిండికేట్‌ అంటూ సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఫైర్!
X

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి హాట్ పోస్టు చేశారు. నిత్యం వివాదాలతో సహవాసం చేసే ఎమ్మెల్యే ఈ సారి సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ సిండికేట్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి.. పార్టీ వాట్సాప్ గ్రూపులో చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు అంతకు మించిన రచ్చకు కారణమవుతున్నాయి. ఇలాంటి బహిరంగ విమర్శలతో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురవుతున్న కొలికపూడి, నేనింతే అన్నట్లు తన పంథానే కొనసాగిస్తుండటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్సీ కొలికపూడి చుట్టూ ఉంటుంది. వివాదాలు ఆయనను ఆకర్షిస్తాయో లేక ఆయనే రాజకీయ రచ్చ చేయాలని కోరుకుంటారో కానీ రాజకీయ మసాల మాత్రం కొలికపూడి వద్ద కొదవ ఉండదని అంటున్నారు. పల్లె కన్నీరు పెడుతోందని ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టారు కొలికపూడి. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయితే ఏదో తెలియక అలా చేశానని, ఇకపై అలాంటి తప్పులు చేయనని వివరణ ఇచ్చుకున్నారు.

అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లు మరో వాట్సాప్ పోస్టు పెట్టి మళ్లీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ‘‘తిరువూరులో వైన్ షాపుల యాజమాన్యాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. సిండికేట్ గా ఏర్పడి బెల్టు షాపులు నడుపుతున్నాయి. లిక్కర్ బాటిల్ పై అదనంగా రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలను దోచుకుంటున్నారు.’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే. గతంలో కూడా ఆయన ఒకసారి మద్యం విక్రయాలపై బహిరంగ విమర్శలు చేశారు. చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని వైన్ షాపుల వద్ద హడావుడి చేశారని గుర్తు చేస్తున్నారు.

ఇక తాజాగా కొలికపూడి పెట్టిన వాట్సాప్ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తిరువూరు టీడీపీ వాట్సాప్ గ్రూపులో ఎమ్మెల్యే ఈ పోస్టు పెట్టారు. వందల మంది కార్యకర్తలు ఉన్న ఆ గ్రూపులో ఎమ్మెల్యే పోస్టు పెట్టడం చర్చకు దారితీస్తోంది. బెల్టు షాపులు, వైన్ షాపుల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలు జరిగితే ఎమ్మెల్యే కొలికపూడి తన పవర్స్ ఉపయోగించి ఎక్సైజ్ అధికారులతో తనిఖీ చేయించే అవకాశం ఉన్నా, ఆ పనిచేయకుండా సోషల్ మీడియాలో పోస్టుల పెట్టడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

ఎక్సైజ్ అధికారులపై అసంతృప్తి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే వెసులుబాటు ఉన్నా, కొలికపూడి ఆ పనిచేయకపోవడం చర్చకు దారితీస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి పోస్టులు పెడుతున్నారని అనుమానిస్తున్నారు. ఎవరినో రోడ్డుకు ఈడ్చాలనే వ్యూహమే ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుదన్న అంశాన్ని ఆయన గ్రహించలేదా? లేదా కావాలనే ఇలా చేస్తున్నారా? అంటూ పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.