అంబటి ఎపిసోడ్.. అస్సలు తగ్గని ఎమ్మెల్యే గళ్లా మాధవి!!
ఇక మాజీ మంత్రి అంబటిపై దాడిని సమర్థించుకున్న టీడీపీ.. ఆయన కుటుంబ సభ్యుల ఎంట్రీతో ఉలిక్కిపడిందని అంటున్నారు. ఇప్పటివరకు అంబటి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది.
By: Tupaki Political Desk | 3 Feb 2026 3:26 PM ISTగుంటూరు ఇంకా గరం.. గరంగానే ఉంది. రెండు రోజులుగా రగులుతున్న నగరంలో రాజకీయం మిర్చి ఘాటును మించేలా గుప్పుమంటోంది. ఒకరి తర్వాత ఒకరుగా అన్నట్లు విమర్శలు, వాగ్బాణాలతో పొలిటికల్ టెంపరేచర్ ను పెంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు మురికి వ్యాఖ్యలు చేశారని ఆయన, ఇల్లు, కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీసు విధి నిర్వహణకు అడ్డుపడటం, సీఎంపై దూషణల కింద మాజీ మంత్రి అంబటిని అరెస్టు చేశారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. అంబటి అరెస్టు తర్వాత ఆయన కుటుంబం న్యాయం చేయాలని రోడ్డెక్కడం, స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి టార్గెట్ గా అంబటి కుమార్తె మౌనిక ఆరోపణలు చేయడంతో రాజకీయం మరింత మండుతోందని చెబుతున్నారు.
టీడీపీ కార్యకర్తల ఆగ్రహాగ్నితో మాజీ మంత్రి అంబటి ఆఫీసు ఆదివారం రాత్రి తగలబడింది. అయితే తన తండ్రి తప్పుగా మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షించాలి కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటని అంబటి కుమార్తె ప్రశ్నించడం కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటివరకు అంబటి కుటుంబ సభ్యులు ఎప్పుడూ రాజకీయంగా ముందుకు రాకపోవడం, ఆయన జైలుకు వెళ్లిన తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టడం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టిందని అంటున్నారు. అంతేకాకుండా అంబటి కుమార్తె తమ ఇంటిపై జరిగిన దాడిని ఎలుగెత్తి చూపే ప్రయత్నంలో పదేపదే కుల ప్రస్తావన తేవడం, సిటింగ్ ఎమ్మెల్యే గళ్లా మాధవిని టార్గెట్ చేస్తూ సిట్యువేషన్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.
ఇక మాజీ మంత్రి అంబటిపై దాడిని సమర్థించుకున్న టీడీపీ.. ఆయన కుటుంబ సభ్యుల ఎంట్రీతో ఉలిక్కిపడిందని అంటున్నారు. ఇప్పటివరకు అంబటి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది. గతంలో కూడా అంబటి వివాదాస్పద వ్యవహారాలలో ఇరుక్కున్న సమయంలో కూడా ఆయన కుటుంబం జోక్యం చేసుకోలేదని గుర్తు చేస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో అంబటి కుటుంబంలోని ఆడవారు బయటకు వచ్చి ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పలు ప్రశ్నలు సంధించారు. దీంతో వ్యవహారం పక్కదారి పడుతుందని టీడీపీ అప్రమత్తమైందని అంటున్నారు.
మాజీ మంత్రి అంబటి కుమార్తె ఆరోపణలపై ఆచితూచి వ్యవహారించాలని డిసైడ్ అయిన టీడీపీ.. మంగళవారం ఎదురుదాడి మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిపై అంబటి అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనతో క్షమాపణలు చేయించాలనే ఉద్దేశంతోనే తాము అంబటి ఇంటికి వెళ్లామని ఎమ్మెల్యే గల్లా మాధవి తాజాగా వివరణ ఇచ్చారు. ఆదివారం టీడీపీ కార్యకర్తలను ముందుండి నడిపించిన మాధవి పార్టీ దృష్టిని ఆకర్షించారు. అయితే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘అంబటి ఇంటిపై దాడికి దిగబడ్డామని’’ మాధవి వ్యాఖ్యానించినట్లు ఒక వీడియోను వైసీపీ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. అంతేకాకుండా మహిళలపై దాడికి ఆమె ఉసిగొల్పారని అంబటి కుమార్తె మౌనిక ఆరోపించడం హీట్ పుట్టించింది.
ఈ పరిస్థితుల్లో ఒక రోజంతా మౌనం వహించిన ఎమ్మెల్యే మాధవి పార్టీ సూచనలతో రంగంలోకి దిగారు. అంబటి ఇంటికి టీడీపీ కార్యకర్తలు ఎందుకు వెళ్లాల్సివచ్చిందో వివరించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి కనీసం క్షమాపణలు చెప్పకుండా తమపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. తొలి నుంచి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా అంబటి వ్యవహరిస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే మాధవి.. తిరుమల లడ్డూ కల్తీని పక్కదారి పట్టించడానికే వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు.
