తమ్ముళ్లు- తలనొప్పులు.. ఒకరి తర్వాత ఒకరు.. !
వాటిపై అప్పట్లో అనుకూల మీడియాలో కూడా తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు, కథనాలు వచ్చాయి.
By: Garuda Media | 18 Aug 2025 9:42 AM ISTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంత చెబుతున్నా..ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నా రో.. లేక..వారినేమీ అనలేదు..కాబట్టి, తమకు వచ్చిన ఇబ్బందిలేదని భావిస్తున్నారో తెలియదు కానీ.. మొత్తంగా తమ్ముళ్ల వ్యవహార శైలి.. రాజకీయంగా రచ్చ రేపుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడు మాసాల్లో ఉచిత ఇసుక వ్యవహారం దుమారం రేపింది. రాజధాని అమరావతికి కూడా ఇసుకను కేటాయించేందుకు కమీషన్లు కావాలని.. పట్టుబట్టిన ఎమ్మెల్యేలు కనిపించారు. ఆ తర్వాత.. మద్యం వ్యవహారం వచ్చింది. లాబీయింగులు, కమీషన్లు ఈ వ్యవహారాన్ని కూడా కాక రేపాయి.
వాటిపై అప్పట్లో అనుకూల మీడియాలో కూడా తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు, కథనాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి చంద్రబా బు అలెర్ట్ అయ్యారు. తమ్ముళ్లను హెచ్చరిస్తూనే వచ్చారు. ఇవన్నీ సామూహికంగా వచ్చిన ఆరోపణలు కావడంతో ఎవరినీ వేలెత్తి చూపకపోయినా.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి అప్పట్లో ముగించారు. ఇక, ఆ తర్వాత మూడుమాసాలకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెరమీదికి వచ్చింది. వ్యక్తిగతంగా ఆయన దూకుడు, విమర్శలు, ప్రభుత్వంపైనే చిందులు తొక్కడం వంటి వివాదానికి దారి తీశాయి. పలు మార్లు కొలికపూడికి పార్టీ పరంగా క్లాస్ ఇచ్చారు.
ఆ తర్వాత.. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఈ వివాదాల బాటలో నడిచారనే చెప్పాలి. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సహా గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేలపైనా విమర్శలు వచ్చాయి. సరే.. అవన్నీ..రాజకీయంగా పార్టీపరంగా.. ఎదుర్కొనేవి కావడంతో చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేశారు. కానీ, తాజాగా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. దీనిలో ఒకరు నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌పైనే బూతుల తో విరుచుకుపడ్డారన్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని తీవ్ర రాజకీయ యాగీ చేసింది.
గుంటూరుకు చెందిన మరో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఏకంగా ఫోన్‌లోనే రాసలీలలు చేశారంటూ.. వివాదాలు రేగాయి. దీనిపైనా పార్టీ ఇరుకున పడింది. ఎంత తప్పించుకుందామని అనుకున్నా.. పక్కా లెక్కలతో బయట పడే సరికి ఇబ్బందులు తప్పలేదు. ఇక, సీనియర్ ఎమ్మెల్యే ఆముదాలవలస నాయకుడు కూన రవి కుమార్ కూడా ఇదే తంతులో చేరిపోయారు. ఓ టీచర్‌ను బెదిరించార న్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. ఆయా పరిణామాలతో పార్టీ ప్రతిష్ట మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయిందన్నది చంద్రబాబు చెబుతున్న మాట. దీంతో ఇక, నుంచి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం అయితే.. పార్టీలో నాయకుల కారణంగా బాబు ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం.
