Begin typing your search above and press return to search.

టీడీపీ భక్తుడు అంటే ఆయనేగా మరి !

తాజాగా ఆయన కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి ఎందరో ప్రముఖులు వచ్చారు. అతిరధ మహారధులైన వారు వచ్చి నిమ్మల కుమార్తెకి నిండు దీవెనలు అందించారు.

By:  Satya P   |   26 Sept 2025 12:02 AM IST
టీడీపీ భక్తుడు అంటే ఆయనేగా మరి !
X

తెలుగుదేశం పార్టీకి అభిమానులు మాత్రమే కాదు భక్తులు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీకి భక్తులు ఉండడం అంటే అది అరుదైన సందర్భంగానే చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కరడు కట్టిన అభిమానులు అంతా భక్తులు గానే ఉంటారు. వారికి పార్టీ ధ్యాస తప్ప మరొకటి ఉండదు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయనను ఎవరైనా చూస్తే ఇట్టే గుర్తు పడతారు. కారణం ఆయన ఒంటి మీద ఎపుడూ పసుపు షర్ట్ ఉంటుంది. ఆయన సర్వకాల సర్వావస్థలలో పసుపు చొక్కాతోనే కనిపిస్తారు. అంతటి పార్టీ భక్తి ఆయనది.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా :

ఆయన పూర్వాశ్రమంలో లెక్చరర్ గా పనిచేశారు. మంచి సబ్జెక్ట్ మాట్లాడుతారు. అంతే కాదు రైతుగా కూడా తన పని తాను చేసుకుంటూంటారు. టీడీపీ పార్టీ గుర్తు అయిన సైకిల్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. దానికి కూడా ఆయన విడిచిపెట్టరు. పొలాలలో ఉన్న రైతులను కలిసినప్పుడు లేదా మారు మూల గ్రామాలకు వెళ్ళేటపుడు సైకిల్ ఉపయోగిస్తారు అని చెబుతారు. మామూలు వేళలలో ఆయన మోటారు సైకిల్ ని ఉపయోగిస్తారు. ఇక నిరాడంబరంగా ఉండే ఆయన తన ప్రతీ రోజులో ఎక్కువ సమయం పార్టీ కోసమే కేటాయిస్తారు.

కూతురు పెళ్ళిలో సైతం :

తాజాగా ఆయన కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి ఎందరో ప్రముఖులు వచ్చారు. అతిరధ మహారధులైన వారు వచ్చి నిమ్మల కుమార్తెకి నిండు దీవెనలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ వంటి వారంతా వచ్చి దీవించారు. ఎంతో గొప్పగా తన కూతురు వివాహం చేసిన నిమ్మల ఆ వివాహ వేడుకల్లో సైతం పసుపు షర్ట్ తోనే కనిపించడం అందరినీ ఆశ్చర్యపరచింది. పూర్తిగా కుటుంబ కార్యక్రమంలో కూడా ఆయన పసుపుదనాన్ని వీడలేదు అంటే అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

నిమ్మలలో ఇంతటి పసుపుదనం ఉందా అని ఆయనని మెచ్చుకుంటున్నారు. నిజానికి చాలా మంది ఇలాంటి శుభ వేళలలో కోటు ధరిస్తారు. ఇంకా తమకు నచ్చిన దుస్తులలో ఉంటారు. కానీ నిమ్మల మాత్రం పసుపు రంగు కంటే గొప్పది ఏముంటుంది అని భావించారో ఏమో అంతే కాదు అన్ని శుభాలకు పసుపుని మించినది లేదు అన్నది కూడా ఆయన అర్ధం చేసుకున్నారు అని అంటున్నారు. అందుకే పసుపు చొక్కాతోనే తన కుమార్తె పెళ్ళికి వచ్చిన వారిని అందరినీ ఆహ్వానిస్తూ కనిపించారు. మొత్తానికి టీడీపీలో ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడు ఉండడం గ్రేట్ అని చెప్పాల్సిందే అంటున్నారు.