మహానాడు ముచ్చట.. వీరికి పనిలేదా ..!
టీడీపీ నిర్వహించే మహానాడు ఈ దఫా ఆన్‌లైన్‌కు మారిపోయింది. వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల్లోనే ముగించాలని కూడా అధినేత చంద్రబాబు తేల్చేశారు.
By: Garuda Media | 17 May 2026 10:00 PM ISTటీడీపీ నిర్వహించే మహానాడు ఈ దఫా ఆన్‌లైన్ కు మారిపోయింది. వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల్లోనే ముగించాలని కూడా అధినేత చంద్రబాబు తేల్చేశారు. అయితే.. వాస్తవానికి మహానాడు అంటే.. సుమారు 2 వేల మంది వరకు కార్మికుల కు పని కల్పిస్తారు. వీరిలో పార్టీ కార్యకర్తల కుటుంబాలు కూడా ఉంటాయి. జెండాలు కట్టేవారి నుంచి ఫ్లెక్సీలు వేసే వారి వరకు.. వంటలు చేసేవారి నుంచి వడ్డించే వారి వరకు కూడా .. వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
ఆ మూడు రోజులు ఒక కోలాహలం. అంతే కాదు.. రవాణా కూడా పెద్ద ఉపాధి మార్గం. వాస్తవానికి.. ఈ మహానాడుకు కార్లు పెట్టేవారు కూడా.. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వస్తారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ.. ఈ దఫా పొదుపు మంత్రం పఠించిన నేపథ్యంలో ఇవన్నీ బంద్ అయ్యాయి. దీంతో వీరి పని కొంత మేరకు తగ్గిపోయింది. ఇదొక్కటే కాదు.. నాయకులకు కూడా మరో చింత పట్టుకుంది. ప్రస్తుతం లోకేష్ హవా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి వారు తమ హవాను ప్రదర్శించుకునేందుకు మహానాడును వేదికగా చేసుకుంటారు. తమ తమ కార్యకర్తలతో ర్యాలీలుగా వచ్చేవారు.. కాన్వాయ్‌లు పెట్టేవారు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు. గత మహానాడు కడపలో జరిగితే.. దెందులూరు నుంచి 100 కార్లతో ఎమ్మెల్యే చింతమనేని తన హవా ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈయన ఒక్కరే కాదు.. ఇలా చాలా మంది నాయకులు తమ బలాన్ని ప్రదర్శించారు. వంటలు.. విందులు షరా మామూలే.
అయితే.. ఇప్పుడు ఎక్కడివారు అక్కడే అన్నట్టుగా వర్చువల్ మహానాడుకు శ్రీకారం చుట్టడంతో తమ తమ బలాల ప్రదర్శనల విషయంలో నాయకులు కూడా డీలా పడ్డారు. విజయవాడలో వారసుడిని రంగంలోకి దింపాలని చూస్తున్న ఓ ఎమ్మెల్యే 100 కార్లను రెడీ చేసుకున్నారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు.కానీ, ఇప్పుడు వర్చువల్ అయ్యేసరికి.. అంతా మౌనంగా ఉండిపోయారు. ఇలా.. మహానాడును ఆన్‌లైన్ చేసేసరికి.. ఇటు కార్మికులు.. అటు నాయకులు కూడా కొంత డీలా పడ్డారన్నదివాస్తవమని నాయకులు చెబుతున్నారు.
