టీడీపీకి గవర్నర్ గిరీ.. ఈ సారి ఆయనకేనా.. ?
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్తగా గవర్నర్ పోస్టులు కేటాయించింది. అయితే.. ఇప్పుడు మరోసారి ఎక్కువ సంఖ్యలో గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉందని సమాచారం.
By: Garuda Media | 1 July 2026 8:00 AM ISTఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్తగా గవర్నర్ పోస్టులు కేటాయించింది. అయితే.. ఇప్పుడు మరోసారి ఎక్కువ సంఖ్యలో గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉందని సమాచారం. ఈ వారంలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు కేంద్ర మంత్రులను తప్పించనున్నారని తెలిసింది. వీరిలో కొందరిని రాష్ట్రాల గవర్నర్‌లుగా పంపించనున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలకు కూడా అవకాశం కల్పించనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు మరోసారి దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఒక గవర్నర్ పోస్టును టీడీపీకి కేటాయించారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించారు. అయితే.. ఈ జాబితాలో పేరు కోసం యనమల రామకృష్ణుడు వేచి చూస్తున్నారు. ఆయనతోపాటు.. వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది.
గవర్నర్‌గా నియమితులయ్యేవారికి ఎలాంటి చదువుతోనూ.. క్వాలిఫికేషన్‌తోనూ పనిలేదు. అయినప్పటికీ.. టీడీపీ నుంచి గవర్నర్లుగా పోటీలో ఉన్నవారిలో యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యలు డిగ్రీ పైనే చదువుకున్నారు. వర్ల రామయ్య నేరుగా ఎస్సై పోస్టుకు ఎంపికైన అభ్యర్థికావడంతో ఆయన ఎం.ఎ వరకు చదువుకున్నట్టు చెబుతారు. ఇక, యనమల కూడా ఎంకాం చదివానని చెబుతుంటారు. సో.. విద్య పరంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
ఇక, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. రెండు గవర్నర్ పోస్టులు దక్కే అవకాశం ఉందని అంటున్నా.. ఒకటి మాత్రం ఖాయమని చెబుతున్నారు. దీనిలో యనమలకు అవకాశం చిక్కుతుందని పార్టీ నాయకుల మధ్య చర్చ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గవర్నర్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కొత్త గవర్నర్ బాధ్యతలను టీడీపీ కోటాకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఒకవేళ ఇది మిస్సయినా.. తమిళనాడుకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కేంద్రం తటస్థ వైఖరిని అవలంభిస్తోంది.
