ఇలా అయితే మా ఫ్యూచరేంటి... తమ్ముళ్ల గగ్గోలు.. !
టీడీపీ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారా? అందరూ దోచుకుంటున్నారా? ఇసుక, మద్యం, మట్టి సహా.. ఇతర అంశాల్లో అందరూ ప్రజలను పీడిస్తున్నారా? అంటే.. కాదనే చెప్పాలి.
By: Garuda Media | 11 Oct 2025 2:00 AM ISTటీడీపీ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారా? అందరూ దోచుకుంటున్నారా? ఇసుక, మద్యం, మట్టి సహా.. ఇతర అంశాల్లో అందరూ ప్రజలను పీడిస్తున్నారా? అంటే.. కాదనే చెప్పాలి. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉండగా.. వీరిలో మహా అయితే.. 10 శాతం మంది కూడా.. ఈ ఆరోపణలు ఎదుర్కొనడం లేదన్నది వాస్తవం. కేవలం 2-5 పర్సంట్ తమ్ముళ్లు మాత్రమే అక్రమాలు, అన్యాయాలు వంటివాటిలో జోక్యం చేసుకుంటున్నారు. మిగిలినవారంతా.. వీటి జోలికి పోవడం లేదు.
కానీ, అందరనికీ కట్టగట్టి.. కేవలం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు మాత్రమే పవిత్రంగా ఉన్నారని.. మిగిలిన వారంతా అధికార మత్తులో జోగుతున్నారని.. పేర్కొంటూ.. టీడీపీకి చెందిన కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. టీవీలు నిర్వహిస్తున్న చర్చల్లో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుత సలహాదారులు కూడా.. ఇదే మాట వినిపిస్తున్నారు. అధికారం చూసుకుని రెచ్చిపోతున్నారని.. దీనివల్ల పార్టీపై ప్రభావం పడుతోందని.. కానీ, చంద్రబాబు, నారా లోకేష్‌లకు ఇవి తెలియవని ఒకరిద్దరు చెబుతున్నారు.
తద్వారా.. పార్టీలో ఉన్న మిగిలిన అందరూ తప్పులు చేస్తున్నారన్నట్టుగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే వ్యూహం ఉందని.. అంటున్నా, మిగిలిన మెజారిటీ నాయకు లు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. తమ పాత్ర ప్రమేయం లేకపోయినా.. అందరినీ కలిపి ఇలా విమర్శిం చడం.. మత్తులో జోగుతున్నారని చెప్పడం సరికాదన్నది వారి వాదన. ``తప్పులు చేస్తున్నవారి పేర్లు చెప్పి.. వారిపై చర్యలు తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, అందరినీ ఒకే గాటన కట్టేయడం సరికాదు`` అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు చెప్పారు.
ఈ విషయమే పార్టీలోనూ చర్చకు వస్తోంది. ముఖ్యంగా కొందరు నాయకులు అసలు వివాదాల జోలికి పోవడం లేదన్నది వాస్తవం. మరికొందరు మాత్రం వైసీపీ నాయకులతో కలిసి పనులు చేస్తున్నారన్నది కూడా వాస్తవమే. ఇంకొందరు స్వల్పంగా మాత్రమే తమ జేబులు నింపుకొంటున్నారు. కానీ, అందరినీ ఒకే తరహా విమర్శిస్తూ.. చర్చల్లో వ్యాఖ్యలు చేయడం, అది కూడా టీడీపీకి చెందిన వారే కామెంట్లు చేయడం వల్ల.. తమ ఇమేజ్ పడిపోతోందన్నది మెజారిటీ తమ్ముళ్ల ఆవేదనగా ఉంది. సో.. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని.. సరిచేయాలని వారు కోరుతున్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టడం ఎందుకు? అందరినీ తప్పుబట్టడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
