దీపక్ రెడ్డికి సంక్రాంతి కానుక.. ఆ ఫ్లైల్ క్లియర్
అయితే ప్రభుత్వం మాత్రం దీపక్ రెడ్డి విషయంలో సానుకూలంగా స్పందించింది. వేతనాల బకాయిని విడుదల చేస్తూ తాజాగా ఆదేశాలిచ్చింది.
By: Tupaki Political Desk | 6 Jan 2026 4:21 PM ISTఏపీ టీడీపీ నేత, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి పోరాటం ఫలించింది. 14 నెలల క్రితం సీడాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దీపక్ రెడ్డికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందాయి. 14 నెలలుగా విధుల్లో ఉన్నా చిల్లిగవ్వ అందకపోవడంపై ఇటీవల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. తనకు జీతం ఇవ్వడం లేదని, ఐఏఎస్ అధికారులు సరిగా పనిచేయడం లేదని దీపక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన టీడీపీలో మరో జీవీ రెడ్డి కాబోతున్నారంటూ విశ్లేషించారు. అయితే ప్రభుత్వం మాత్రం దీపక్ రెడ్డి విషయంలో సానుకూలంగా స్పందించింది. వేతనాల బకాయిని విడుదల చేస్తూ తాజాగా ఆదేశాలిచ్చింది.
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డిని ప్రభుత్వం సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ) చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. 14 నెలలుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఇంతవరకు ఎలాంటి వేతనాలు, అలవెన్సులు చెల్లించలేదు. ఈ విషయాన్ని దీపక్ రెడ్డి స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఐఏఎస్ అధికారులు మాట వినడం లేదని, పనులు చేయడం లేదన్న అసంతృప్తితో ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించి, దీపక్ రెడ్డికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలను ఒకేసారి విడుదల చేసినట్లు చెబుతున్నారు.
నామినేటెడ్ పదవిలో ఉన్న తనమాటే అధికారులు లెక్కచేయడంపై గత నెల 26న దీపక్ రెడ్డి మీడియా సాక్షిగా బరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర పాలన వ్యవస్థకు పట్టిన గ్రహణమని, దరిద్రంగా తయారయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 నెలలుగా తనకు జీతం ఇవ్వలేదని, ఈ విషయమై ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన ఫైల్ క్లియర్ చేయడం లేదని మండిపడ్డారు. ఇన్ని నెలలుగా ఒక్క ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐఏఎస్ అధికారులు తమ అవినీతి కోసమే పనుల్లో కాలయాపన చేస్తున్నారని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కలెక్టర్ల కారణంగానే 2019లో చంద్రబాబు, 2024లో జగన్ ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వంలో మంచి గుర్తింపు, స్థాయి ఉన్న నేతకే ఐఏఎస్ లు ముచ్చెమటలు పట్టించడంపై పార్టీ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరిగిందని అంటున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై కల్పించుకున్నారని చెబుతున్నారు. దీపక్ రెడ్డితోపాటు ఆర్థిక శాఖలో పెండింగులో ఉన్న నామినేటెడ్ చైర్మన్ల ఫైళ్లు అన్నీ క్లియర్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. 14 నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆఫీసు నిర్వహణతోపాటు సిబ్బంది ఖర్చులను దీపక్ రెడ్డి స్వంతంగా భరించాల్సివచ్చిందని చెబుతున్నారు.
అయితే 14 నెలల పాటు వేతనాలు చెల్లించకుండా బకాయి పెట్టడానికి కారణాలేమంటూ ప్రభుత్వం ఆరా తీసిందని చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల దీపక్ రెడ్డి బకాయిలు చెల్లించలేకపోయామని అధికారులు వివరణ ఇచ్చారని అంటున్నారు. అయితే అధికారుల వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదని, ఇకపై ఇలాంటి అపార్థాలు, అపోహలకు తావివ్వకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.
