ఎమ్మెల్యే స్థాయి మహిళా నేతకే వరకట్న వేధింపులు?
టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అధికార పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఆమెను డబ్బు కోసం భర్త వేధించారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 28 Oct 2025 1:34 PM ISTఏపీలో టీడీపీ మహిళా నేత వరకట్న వేధింపుల కేసులో పోలీసుల సాయం కోరడం చర్చనీయాంశమైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అధికార పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఆమెను డబ్బు కోసం భర్త వేధించారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బలం ఉన్నా, ఆ మహిళా నేత భర్త పై పెద్ద ఎత్తున ఆరోపణలు , చర్చ జరుగుతోంది. భార్య ఓ పార్టీ ఇన్చార్జిగా, ఆమె తండ్రి మరో పార్టీ నేతగా ఉన్నప్పటికీ ఆమెకు వేధింపుల వస్తున్నాయి అనే ఆరోపణలు సంచలనం గా మారాయి.
టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య తన భర్త నుంచి రక్షణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. అమూల్య మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. ఇటీవల రాజోలు టీడీపీ ఇన్చార్జిగా అమూల్య బాధ్యతలు తీసుకున్నారు. ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ, నియోజకవర్గ కేడర్ అమూల్య నాయకత్వాన్ని కోరుకోవడంతో అధిష్టానం కొద్దిరోజుల క్రితమే ఆమెను ఇన్చార్జిగా నియమించింది. అధికార పార్టీలో ఎమ్మెల్యే హోదాలో పనిచేస్తున్న అమూల్యను అదనపు కట్నం కోసం భర్త వేధించారని, ఒకసారి హత్యయత్నానికి ఒడిగట్టారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసులకు ఫిర్యాదు అందింది.
భర్త వేధింపులను తట్టుకోలేకపోతున్నానని రాజోలు టీడీపీ ఇన్చార్జి అమూల్య సోమవారం పోలీసులను ఆశ్రయించారు. తన భర్త దొమ్మేటి సునీల్ దురలవాట్లకు బానిసయ్యాడని, తనను పిల్లల్ని చంపేస్తానని బెదిరించడంతోపాటు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. తన భర్త నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అమూల్యకు 2009 మార్చి 4న దొమ్మేటి సునీల్ తో పెద్దల సమక్షంలో వివాహమైందని చెబుతున్నారు. కులాంతర వివాహమే అయినప్పటికీ పెద్దలు అంగీకారంతో వివాహం జరిగినట్లు అమూల్య తన ఫిర్యాదులో తెలిపారు. వివాహ సమయంలో తన తండ్రి గొల్లపల్లి సూర్యారావు రూ.50 లక్షల నగదు, 100 తులాల బంగారం, ఎకరం భూమి కట్నంగా ఇచ్చాడని, వివాహమైన తర్వాత కొన్నాళ్లు సవ్యంగా ఉన్న సునీల్ ఆ తర్వాత డబ్బు కోసం హింసించడం మొదలుపెట్టినట్లు అమూల్య తన ఫిర్యాదులో తెలిపారు.
తన బాధను చూడలేక తండ్రి సూర్యారావు దపదఫాలుగా రూ.3 లక్షలు ఇచ్చారని, అయినా వేధింపులు ఆగలేదని తెలిపారు. తన భర్తకు అత్త మణి కూడా సహాయం చేస్తుందని, ఇద్దరూ కలిసి తనకు టార్చర్ చూపిస్తున్నారని అమూల్య ఫిర్యాదు చేశారు. తన సిమ్ కార్డులను తీసుకోవడంతోపాటు అతడి ఈ-మెయిల్ తో అమూల్య సోషల్ మీడియా ఖాతాలను అనుసంధానం చేసి తప్పుడు ప్రచారానికి ప్రయత్నించినట్లు బాధితురాలు ఆరోపించారు. అదేవిధంగా ఈ ఏడాది జూన్ 16న రాత్రి ఇంట్లో సీలింగు ఫ్యాన్ కు ఉరేసి చంపాలని ప్రయత్నించినట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేస్తే పెద్ద మనుషులు వచ్చి తన భర్తను మందలించారని, వారి ముందు చేసిన తప్పు ఒప్పుకున్న సునీల్ మళ్లీ చిత్రహింసలకు పాల్పడుతున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వివరించారు.
