Begin typing your search above and press return to search.

కొలికిపూడి ఫైరింగ్.. అసలు కారణం ఇదేనా?

ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తిరువూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును చెప్పాలి.

By:  Garuda Media   |   24 Oct 2025 9:56 AM IST
కొలికిపూడి ఫైరింగ్.. అసలు కారణం ఇదేనా?
X

అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కాంగ్రెస్ పార్టీ తర్వాత.. అధినాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకు ఎక్కే నేతలున్న పార్టీల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ. పేరుకు జాతీయ పార్టీగా చెప్పినా.. ప్రాంతీయ పార్టీగానే పరిగణించాలి.తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు భిన్నమైన వైఖరి టీడీపీ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రజాసమస్యల మీద మాట్లాడేందుకు రాని తెగువ.. ధైర్యం..సొంత ప్రయోజనాలు దెబ్బ తిన్న వెంటనే.. అధినేత ఏమనుకుంటారన్న సోయి కూడా లేకుండా నోటికి.. చేతికి పని చెబుతూ పార్టీని ఇరకాటంలో పడేసే నేతలకు టీడీపీలో కొదవ లేదనే చెప్పాలి.

ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తిరువూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును చెప్పాలి. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో.. ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పిన కొందరు తెలుగు తమ్ముళ్లలో కొలికపూడి ఒకరు. అందుకే.. టీడీపీ వీరాభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. అయితే.. కూటమి సర్కారు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి తరచూ ఏదో ఒక సంచలన స్టేట్ మెంట్లు.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో వ్యక్తిగా మారిన ఆయన తీరు పార్టీకి తలనొప్పిగా మారిందంటారు.

దీనికి తోడు సొంత పార్టీకి చెందిన ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి చేసే విమర్శలు తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. దీంతో ఆయన్ను పిలిపించిన అధిష్ఠానం ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతారు. దీంతో కొంతకాలం మౌనంగా ఉన్నట్లు చెబుతారు. అయితే.. ఇటీవల తిరువూరు నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ చిన్నికి అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. తిరువూరు నియోజకవర్గ అంశాల్ని చిన్నినే చక్కదిద్దుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. కొలికిపూడి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా తిరువూరు నియోజకవర్గంలో చిన్ని పర్యటించటంతో కొలికిపూడి బరస్ట్ అయినట్లుగా చెబుతున్నారు. అధిష్ఠానం ఎలా రియాక్టు అవుతుందన్న విషయాన్ని వదిలేసి మరీ.. చిన్ని మీద చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎన్నికల సమయంలో తాను కేశినేని చిన్నికి భారీగా డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేయటమే కాదు.. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సప్ స్టేటస్ లో పెట్టటంతో ఈ వ్యవహారం టీ కప్పులో తుపానుగా కాకుండా.. సునామీగా మారిందన్న మాట వినిపిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి.. తనను డమ్మీగా మార్చిన అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కొలికిపూడి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తాజాగా కొలికపూడి వర్సెస్ చిన్న వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. గతానికి భిన్నంగా ఈసారి కొలికపూడి విషయంలో పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాన్ని తీసుకుంటారని చెబుతున్నారు. అయితే.. గీత దాటిన తమ్ముళ్లపై వేటు వేసే విషయంలో పూర్ ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు.. కొలికపూడిని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.