తెలుగు మహిళ వర్సెస్ వీర మహిళ: రోడ్డున పడ్డ లేడీ లీడర్స్
ఎమ్మెల్యేలు, ఎంపీలమధ్య వివాదాలు ఒకవైపు జోరుగా సాగుతుంటే.. తాజాగా కీలక పార్టీలైన టీడీపీ, జనసేనల్లోని మహిళా నాయకులు కూడా రోడ్డున పడ్డారు
By: Garuda Media | 21 Sept 2025 12:29 PM ISTకూటమి సర్కారులో కుమ్ములాటలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలమధ్య వివాదాలు ఒకవైపు జోరుగా సాగుతుంటే.. తాజాగా కీలక పార్టీలైన టీడీపీ, జనసేనల్లోని మహిళా నాయకులు కూడా రోడ్డున పడ్డారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధం కీలక విభాగం `తెలుగు మహిళ`. అదేవిధంగా జనసేన పార్టీకి అనుబంధ మహిళా విభాగం.. `వీర మహిళ.` అయితే.. ఇప్పటి వరకు ఈ రెండు విభాగాలు కలిసింది లేదు.. కలివిడిగా కార్యక్రమాలు నిర్వహించింది కూడా లేదు. కానీ, అనూహ్యంతో తీవ్ర వివాదాలతో రచ్చకెక్కి.. రాజకీయం చేసుకున్నారు.
ఎలా మొదలైంది?
శుక్రవారం అసెంబ్లీ అనంతరం.. సీఎం, డిప్యూటీ సీఎంలు కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు పక్కగా పొట్టి కుర్చీలో డిప్యూటీసీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూర్చున్నారు. దీనిపై జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ఒక కుర్చీ వేసి.. పవన్ కల్యాణ్‌కు కాసింత దూరంగా మరో పొట్టి కుర్చీ వేయడం ఏంటని సోషల్ మీడియాలో చర్చకు దిగారు. ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. ``కుర్చీల్లో తేడానే కాదు.. వ్యక్తిత్వంలోనూ తేడా ఉంది.`` అంటూ జనసేన వీర మహిళా విభాగం నాయకురాలు ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు.
`విత్ బెయిల్-వితౌట్ బెయిల్` అంటూ.. సీఎం, డిప్యూటీ సీఎం కూర్చున్నకుర్చీల ఫొటోలతోపాటు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇది మరింత రచ్చకు దారి తీసింది. దీనిపై టీడీపీ తెలుగు మహిళా విభాగం నాయకురాలు అనూష ఉండవల్లి మరింత తీవ్రంగా స్పందించారు. ``మా చంద్రుడు ఏకపత్నీ వ్రతుడు.. మిగిలిన వాళ్లు నాకు తెలియదు`` అంటూ.. పరోక్షంగా జనసేన అధినేతపై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ రచ్చ మరింత తారస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో కామెంట్లను తొలగించేది లేదని తెలుగు మహిళ నాయకురాలు పేర్కొనగా.. నేను కూడా తొలగించను.. ``బెయిల పక్షుల కూతలకు ఎవరూ లొంగరు`` అంటూ వీర మహిళ వ్యాఖ్యానించింది. దీంతో తెలుగు మహిళ వర్సెస్ వీర మహిళల సోషల్ యుద్ధం రాజకీయంగా దుమారం రేపింది. అయితే.. ఇంత జరుగుతున్నా.. రెండు పార్టీల నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు.
