ఐక్యరాజ్యసమితి టూర్ కు టీడీపీ, జనసేన ఎంపీలకు చాన్స్ దక్కలేదా... నిజమేనా?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందంలో ఏపీలోని కూటమి ఎంపీలకు చాన్స్ దక్కలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
By: Tupaki Political Desk | 9 Oct 2025 1:26 PM ISTఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందంలో ఏపీలోని కూటమి ఎంపీలకు చాన్స్ దక్కలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ అంశంపై ఫ్యాక్ట్ చెక్ లో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు మన దేశం నుంచి రెండు విడతలుగా ఎంపీలు వెళుతున్నారు. అయితే ఇలా వెళ్లిన వారిలో టీడీపీ, జనసేన ఎంపీల పేర్లు లేవంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన స్క్రీన్ షాట్లను విపక్షాలు వైరల్ చేస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి 80వ సాధారణ సమావేశాలు నూయ్యార్క్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి 14 వరకు ఒక బృందం, నెలాఖరులో మరో బృందం ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఒక్కో బృందంలో 15 మందిని ఎంపిక చేశారు. లోక్ సభ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని ఒక బృందం ఇప్పటికే న్యూయార్క్ చేరుకుంది. నెలాఖరులో పర్యటించనున్న మరో బృందం లిస్టును కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ లిస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ టీడీపీ, జనసేన ఎంపీలను ఎంపిక చేయలేదంటూ వైరల్ చేస్తున్నారు.
నిజానికి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి చేరుకున్న బృందంలో టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఉన్నారు. ఆయన ఈ నెల 14 వరకు జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. కానీ, సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీలు ఎవరూ లేరని జరుగుతున్న ప్రచారం మాత్రం విస్మయం కలిగిస్తోంది. దీనికి కారణం ఏంటని ఫ్యాక్ట్ చెక్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న లిస్టు రెండో విడతలో న్యూయార్క్ వెళ్లనున్న ఎంపీల జాబితాగా తేలింది. ఇందులో తెలుగుదేశం, జనసేన ఎంపీల పేర్లు లేకపోవడంతో అసలు ఐక్యరాజ్యసమితికి వెళ్లే బృందంలో కూటమి ఎంపీలు ఎవరూ లేరంటూ విపక్షం వైరల్ చేసిందని అంటున్నారు.
ఈ సంఘటన సోషల్ మీడియా వ్యవహారంపై మరోమారు తీవ్ర చర్చకు దారితీసింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపడమే సోషల్ మీడియా జిమ్మిక్కుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా నిత్యం వాడివేడి రాజకీయం కొనసాగే ఏపీ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలను సోషల్ మీడియాలో చూసి నిజమని నమ్మలేమని, ఆ కంటెంట్ ను ఇతర మార్గాల్లో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
