Begin typing your search above and press return to search.

బాబు - ప‌వన్ స‌ఖ్య‌త ఓకే... కేడ‌ర్ క‌ల‌వ‌ట్లేదా...?

ఒకటి, రెండు రోజులు పాటు ఈ విషయాలు తీవ్రస్థాయిలో చర్చకు వచ్చినా తర్వాత సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం తెలిసిందే.

By:  Garuda Media   |   8 Oct 2025 9:47 AM IST
బాబు - ప‌వన్ స‌ఖ్య‌త ఓకే... కేడ‌ర్ క‌ల‌వ‌ట్లేదా...?
X

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. ముఖ్యంగా అసెంబ్లీలో టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అదే విధంగా రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలతో జనసేనకు, టిడిపి నాయకులకు మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నంతగా పై స్థాయిలో కనిపించడం లేదు. పై స్థాయిలో అగ్ర నాయకులు మాత్రం కలివిడిగానే ముందుకు సాగుతున్నారు. ఒకటి, రెండు రోజులు పాటు ఈ విషయాలు తీవ్రస్థాయిలో చర్చకు వచ్చినా తర్వాత సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం తెలిసిందే.

దాదాపు 40 నిమిషాలకు పైగా ఆయన ప‌వ‌న్‌తో చర్చించడం వంటివి పార్టీలోని అగ్రనేతలను ఒకింత శాంతింప చేసిందనే చెప్పాలి. అయితే, ఈ విషయాలను లైట్ తీసుకున్న క్షేత్రస్థాయి జనసేన టిడిపి నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దూష‌ణ‌లకు దిగడం వంటివి ఇంకా కొనసాగుతున్నాయి. ఇదే జరిగితే నష్టపోయేది మాత్రం క్షేత్రస్థాయి నాయకులే తప్ప అగ్ర నేతలు కాదన్నది మరోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది.

విజయవాడలో జరిగిన `ఆటో డ్రైవర్ల సేవలో` కార్యక్రమంలో ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసించారు, బలమైన నాయకుడు సారధ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని కూడా చెప్పారు. సో దీన్ని బట్టి అగ్రనేతలు బాగానే ఉన్నారు. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వారిలో పెద్దగా తేడా అయితే కనిపించడం లేదు. సర్దుకుపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి.

కానీ, క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం జనసేన, టిడిపి నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై బాలకృష్ణను సమర్థించే వారు టిడిపిలో క‌నిపిస్తున్నా రు. అలా కాదు బాలకృష్ణ చేసింది తప్పు చిరంజీవిని అవమానించారని చెప్పేవారు జనసేనలోనూ మెజారిటీగా కనిపిస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే పరిణామాలు ముందు ముందు కూడా కంటిన్యూ అయితే అది వారికే నష్టం తప్ప పార్టీలకైతే కాదన్నది అగ్రనేతలు అనుసరిస్తున్న విధానాలను బట్టి స్పష్టమవుతుంది.

ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదేవిధంగా టిడిపి కూడా ఆచితూచి నాయకులను ఎంపిక చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం వస్తున్న వివాదాలు విభేదాల నేపథ్యంలో చాలామంది నాయకులను పక్కన పెట్టే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయిలో నాయకులు మధ్య కలివిడి లేకపోతే రేపటి రోజున కొత్త నాయకులకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. కాబట్టి అగ్ర నాయకులు అనుసరిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో నాయకులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అది వారికే నష్టం తప్ప అగ్ర నాయకులకు ఎటువంటి నష్టం లేదన్నది తెలుసుకోవాలి.