కొత్త పాలిటిక్స్: పరిచయాలు పెంచుతున్నారు.. !
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులు దూకుడు పెంచారు.
By: Garuda Media | 1 Oct 2026 4:00 AM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులు దూకుడు పెంచారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న వాదన ఒక వైపు వినిపిస్తుండగా.. మరో వైపు తమ తమ వారసులను బరిలో నిలిపి.. తమ తర్వాత తరానికి రాజకీయాలు అప్పగించే యోచన దిశగా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. మరికొందరు.. తమకు తమ వారికి అన్నట్టుగా రాజకీయ కేంద్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. తద్వారా.. ఒకే కుటుంబం నుంచి నాయకుల రాక పెరుగుతోంది.
అయితే.. ఈ వ్యవహారం నిన్నటి వరకు చర్చకు మాత్రమే పరిమితం కాగా.. ఇప్పుడు కార్య రూపంలోనూ ముందుకు వచ్చేస్తోంది. అధినేత అనుగ్రహించారో లేదో తెలియదు. పార్టీ పరంగా చర్యలు తీసుకుని.. చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో కూడా డౌటే. అయితే.. నాయకులు మాత్రం దూకుడు పెంచేశారు. తమ తమ వారసులను రాజకీయ పరిచయాలకు రంగంలోకి దింపారు. గుంటూరులో ఓ ఎమ్మెల్యే తన కుమార్తెను రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఆమె ఇంటింటికీ తిరుగుతున్నారు.
వీలు కుదిరితే.. కాదు.. వీలు చేసుకుని ఆమెకు కీలక పదవిని ఇప్పించుకునేదిశగా అడుగులు వేసేశారు. ప్రస్తుతం ఆమె జోరు నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, విజయవాడలో మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న ఓ ఎమ్మెల్యే తన కుమారుడును కూడా బరిలో నిలిపేశారు. పరామర్శలు, సంతాపాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు కుమారుడిని వెంటేసుకుని వచ్చేస్తున్నారు. కీలక నాయకులకు పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలోనూ ఓ నేత తన సతీమణిని రంగంలోకి దింపేశారు. ఆమె కూడా ప్రజలను కలుసుకుంటున్నా రు. స్థానికంలో సత్తా చాటి.. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు రెడీ అయిపోయారు. ఇవన్నీ.. కేవలం టీడీపీ లోనే కాదు.. జనసేనలోనూ ఒకరిద్దరు నాయకులు తమ వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నారు. వారిని తీసుకుని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. మొత్తంగా కొత్త రాజకీయాలు.. కొత్త నాయకులు అంటూ.. వీరు పరిచయాలు పెంచుకుంటున్నారు.
