Begin typing your search above and press return to search.

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన.. 'ఫొటో' ర‌గ‌డ‌.. పీ.గ‌న్న‌వ‌రంలో డిష్యుం డిష్యుం!

శ‌నివారం కూట‌మి ప్ర‌భుత్వం.. `ఆటోడ్రైవ‌ర్ల‌కు సేవ‌లో` ప‌థ‌కాన్ని ప్రారంభించింది. జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ ప‌థ‌కా నికి సంబంధించిన నిధుల‌తో కూడిన చెక్కుల‌ను పంపిణీ చేశారు.

By:  Garuda Media   |   4 Oct 2025 11:13 PM IST
టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన.. ఫొటో ర‌గ‌డ‌.. పీ.గ‌న్న‌వ‌రంలో డిష్యుం డిష్యుం!
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌ల‌న్న విష‌యం తెలిసిందే. ఈ రెండు పార్టీలే గ‌త ఎన్నిక‌ల స‌మ యంలో బ‌లంగా నిల‌బ‌డి.. బీజేపీని క‌లుపుకొని ముందుకుసాగాయి. అయితే.. అక్క‌డ‌క్క‌డ చిన్న చిన్న లోపాలు క‌నిపిస్తున్నా కూట‌మి పార్టీలు క‌లివిడిగానే ప్ర‌భుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. అయితే.. తాజాగా చోటు చేసుకున్న వివాదంలో టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులు క‌ల‌బ‌డ్డారు. ఒకరిపై ఒక‌రు తోపులాట‌కు దిగారు. దుర్భాష‌ల‌తో రెచ్చిపోయారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం అంతా కూడా జ‌న‌సేన ఎమ్మెల్యే స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం.. ఆయ‌న కూడా అసంతృప్తితో ఉండ‌డంతో టీడీపీ నాయ‌కులే వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఏం జ‌రిగింది?

శ‌నివారం కూట‌మి ప్ర‌భుత్వం.. `ఆటోడ్రైవ‌ర్ల‌కు సేవ‌లో` ప‌థ‌కాన్ని ప్రారంభించింది. జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ ప‌థ‌కానికి సంబంధించిన నిధుల‌తో కూడిన చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఆయా చెక్కుల‌ను స్థానిక కూట‌మి ఎమ్మెల్యేలు ఆవిష్క‌రించి న అనంత‌రం.. బ్యాంకు అధికారులు వారి ఖాతాల్లోకి నిధులు జ‌మ చేశారు. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వివాదం చోటు చేసుకుంది. ప్ర‌భుత్వం పంపిణీ చేసిన చెక్కు, అదేవిధంగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి రాష్ట్ర ర‌వాణా శాఖ ముద్రించి పామ్ ప్లేట్‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ఫొటో మాత్ర‌మే ఉంది. ఆయ‌న ఫొటోతో కూడిన చెక్కుల‌నే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు.

అయితే.. ఎక్క‌డా రాని వివాదం పి. గ‌న్న‌వ‌రంలో చోటు చేసుకుంది. జ‌నసేన ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ కూడా ఉంది. దీంతో చెక్కులు స‌హా ర‌వాణాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బ్యాన‌ర్లు, పామ్ ప్లేట్ల‌పై ఒక్క‌చంద్ర‌బాబు ఫొటోను మాత్ర‌మే ముద్రించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో ఏదంటూ.. జ‌న‌సేన నాయకులు నిల‌దీశారు. దీంతో ప్ర‌భుత్వం అలానే త‌మ‌కు ఆదేశాలు ఇచ్చింద‌ని.. త‌మ ప్ర‌మేయం లేద‌ని అధికారులు తెలిపారు. దీంతో ఈ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రించాలంటూ.. ఎమ్మెల్యే గిడ్డిస‌త్య‌నారాయ‌ణ‌పై జ‌న‌సేన నాయ‌కులు ఒత్తిడి తెచ్చారు.

అయితే.. ఈస‌మ‌యంలోనే టీడీపీ నాయ‌కులు వివాదానికి దిగారు. ఇది పార్టీ కార్య‌క్ర‌మం కాద‌ని, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మ‌మ‌ని, ప్ర‌భు త్వానికి సీఎం మాత్ర‌మే `పెద్ద‌` అని పేర్కొన్నారు. అందుకే ఆయ‌న ఫొటోను మాత్ర‌మే ముద్రించార‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌రింత‌గా వివాదం ముదిరి.. జ‌న‌సేన నాయ‌కులు దుర్భాష‌ల‌కు దిగారు. ప్ర‌తిసారీ త‌మ‌కు అవ‌మానాలే జ‌రుగుతున్నాయ‌ని అన‌డంతో .. టీడీపీ నేత‌లు కూడా ఎదురు దాడి చేయ‌డం ప్రారంభించారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదం ముదిరి.. ఒక‌రిపై ఒక‌రు క‌ల‌బ‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై మౌనంగా ఉన్న ఎమ్మెల్యే గిడ్డి.. వివాదం ముదురుతున్న క్ర‌మంలో జోక్యం చేసుకుని.. ``పార్టీ అధిష్టానానికి విష‌యం చెబుదాం. ఇప్ప‌టికి పోనివ్వండి`` అని అన‌డంతో జ‌నసేన నాయ‌కులు కొంత వెన‌క్కి త‌గ్గారు. మ‌రికొంద‌రు కార్య‌క్ర‌మాన్ని బాయ్‌కాట్ చేశారు.