Begin typing your search above and press return to search.

ఒంగోలు కూటమి మేయర్...శిద్దా ఫ్యామిలీ ఫోకస్ !

ఒంగోలు రాజకీయాలు ఎప్పుడూ చైతన్యంగా ఉంటాయి. అక్కడ నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే వాతావరణం ఉంటుంది.

By:  Satya P   |   30 July 2026 1:19 AM IST
ఒంగోలు కూటమి మేయర్...శిద్దా ఫ్యామిలీ ఫోకస్ !
X

ఒంగోలు రాజకీయాలు ఎప్పుడూ చైతన్యంగా ఉంటాయి. అక్కడ నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే వాతావరణం ఉంటుంది. గతంలో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం సాగేది. తర్వాత టీడీపీ వైసీపీగా మారింది. ఇక ఇపుడు జనసేన కూడా తన వంతుగా ఈ జిల్లాలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఎపుడు ఎన్నికలు జరిగినా ఒకే పక్షంగా కాకుండా రెండు పార్టీలకు సీట్లు అందించడం జిల్లా స్పెషల్. ఇక కూటమి ప్రభంజనంలో కూడా వైసీపీకి ఈ జిల్లాలో రెండు సీట్లు దక్కాయి. ఇదిలా ఉంటే ఇపుడు కూటమి హవా జిల్లాలో సాగుతోంది. దాంతో స్థానిక ఎన్నికల సందడి కూడా కూటమిలో ఎక్కువగా కనిపిస్తోంది.

మేయర్ పదవి కోసం :

మరో రెండు నెలలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి పార్టీలు సమాలోచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికరంగా మేయర్ సీటు మీద పలువురు ఫోకస్ పెట్టారు. జనసేన కూడా ఒంగోలు పీఠం మీద కన్ను వేసింది అని అంటున్నారు. ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు ఉన్నారు. దాంతో ఆయన ఎక్కువ వార్డులు కూటమిలో పొత్తులో భాగంగా తీసుకుని వచ్చే ఎన్నికల్లో కార్పోరేషన్ లో జనసేన కీలకం చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే బలమైన నాహ్యకులు ఎందరో ఉన్నారు. అయితే అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ ఆలోచనగా ఉంది. దాంతో ఈసారి ఆర్య వైశ్యులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట ఇక్కడ చెల్లుబాటు అవుతుందని కూడా చెబుతున్నారు.

శిద్ధా ఫ్యామిలీ ఆ వైపు :

ఇక ఒంగోలు రాజకీయాల్లో శిద్ధా కుటుంబానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శిద్ధా రాఘవరావు 2014లో టీడీపీ తరఫున గెలిచారు. ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే 2019లో ఆయన్ని పార్లమెంట్ కి పోటీ చేయించారు. వైసీపీ ప్రభంజనం లో ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. 2024లో దర్శి టికెట్ ని కోరారు అని ప్రచారం సాగింది. అయితే జగన్ కి సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన వైసీపీలో సైలెంట్ గా ఉండి 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచాక బయటకు వచ్చేశారు. అయితే టీడీపీలో చేరుతారు అని ప్రచారం అయితే ఉంది కానీ అది జరగలేదు, ఇపుడు మేయర్ అభ్యర్ధిగా టీడీపీ కూటమి తరఫున అనూహ్యంగా ఆయన కుమారుడు సిద్ధా సూర్య ప్రకాశరావు పేరు వినిపిస్తోంది అని అంటున్నారు.

ఆమోదయోగ్యంగా :

అన్ని సామాజిక వర్గాల నుంచి పోటీ ఇపుడు గట్టిగా ఉంది. 2021లో ఇక్కడ జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ సీటుని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. దాంతో ఈసారి ఓసీకి మేయర్ సీటు కేటాయిస్తారు అని అంటున్నారు. దాంతో రెడ్డి, కాపు కమ్మలు ఆర్య వైశ్యులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారని అంటున్నారు. దాంతో అనూహ్యంగా ఆర్య వైశ్యులను ముందుకు టీడీపీ తెస్తోంది అని అంటున్నారు. దాంతో మాజీ మంత్రి శిద్ధా కుటుంబానికి ఇది అనుకూలం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి అలా జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అన్ని విధాలుగా వివాదరహితంగా ఉండే శిద్ధా వ్యామిలీకి మేయర్ పదవి అన్నది కట్టబెడితే రాజకీయంగా రెండో ఇన్నింగ్స్ ఆ కుటుంబానికి స్టార్ట్ అయినట్లే అని అంటున్నారు.