Begin typing your search above and press return to search.

అంతా మ‌నోళ్లేనా.. ఏపీలో అనుమానపు రాజ‌కీయం...!

ఏ చిన్న కార్య‌క్ర‌మం గురించి చ‌ర్చ జ‌రిగినా.. నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తున్న మాట.. ''అంతా మ‌నోళ్లేనా!'' అనే.

By:  Garuda Media   |   30 March 2026 7:00 PM IST
అంతా మ‌నోళ్లేనా.. ఏపీలో అనుమానపు రాజ‌కీయం...!
X

ఏ చిన్న కార్య‌క్ర‌మం గురించి చ‌ర్చ జ‌రిగినా.. నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తున్న మాట.. ''అంతా మ‌నోళ్లేనా!'' అనే. దీనికి కార‌ణం.. వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కుల‌తో ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన కిట‌కిట‌లాడుతోంది. దీంతో ఎవ‌రు మ‌నోళ్లు.. ఎవ‌రు ఇత‌ర పార్టీల వాళ్లు అనే తేడా ఉన్నా.. వారి వ్యూహాలు.. అవ‌లంభిస్తున్న మార్గాల‌పై నాయ‌కుల‌కు సందేహాలు ఉన్నాయి. కొంద‌రు ఇప్ప‌టికీ కోవ‌ర్టులుగా ఉన్నార‌న్న చ‌ర్చ ఇరు పార్టీల నాయ‌కుల‌కు ఇబ్బందిగానే మారింది.

దీంతో ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా..కార్య‌క‌ర్త‌ల‌ను ఆహ్వానించేప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు . ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే స్థానిక స‌మ‌స్య‌ల‌పై పెద్ద క‌స‌ర‌త్తు చేశారు. ఆయన కీల‌క‌ నాయ‌కుడు. కానీ, ప‌లు పార్టీల‌కు చెందిన వారు కూడా.. ఈ స‌మావేశానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌పై స‌ద‌రు నేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. తాను చెప్పినా కూడా ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

అయితే.. చిత్రంగా.. ఇంత ర‌హ‌స్య స‌మావేశంలో చ‌ర్చించిన విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. మీడియాను అనుమ‌తించ‌కుండా.. కేవ‌లం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో చ‌ర్చించిన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి.. స‌ద‌రు నేత ఆశ్చ‌ర్య పోయాడు. దీంతో త‌న అనుచ‌రుల‌ను పిలిచి... అంతా మ‌నోళ్లేవ‌చ్చారా.? అని మ‌రుస‌టి రోజు ఆరా తీశారు. అయితే.. అంద‌రూ మ‌నోళ్లేన‌ని స‌ద‌రు అనుచ‌రుడు చెప్పినా.. వారి వివ‌రాలు తెప్పించుకుని ప‌రిశీలించుకున్నారు.

ఈ స‌మ‌స్య కేవ‌లం విజ‌య‌వాడ‌కే ప‌రిమితం కాలేదు. తిరుప‌తి, చిత్తూరు, నెల్లూరుల‌లో మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా పార్టీల అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అయితే.. ఫోన్ల‌ను కూడా అలౌ చేయ‌డం లేద‌ట‌. ఎక్క‌డ త‌మ చ‌ర్చ‌ల సారాంశం బ‌య‌ట‌కు పొక్కుతుందో అని నాయ‌కులు త‌మ‌లో తామే దిగులు పెట్టుకుంటున్నారు. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెబితే.. అస‌లైన కార్య‌క‌ర్త‌లు నొచ్చుకుంటారు.. చెప్ప‌క‌పోతే.. త‌మ‌కు ఇబ్బందితో పాటు ప్ర‌మాదం కూడా ఉండ‌డంతో ముందుగానే ఒక‌టికి రెండు సార్లు మ‌నోళ్లా.. కాదా.. అని నిర్ధారించుకుని.. కార్య‌క‌ర్త‌ల‌ను పిలుస్తున్నార‌ట‌.