చాకచక్యంగా తప్పుకున్న చంద్రబాబు, పవన్.. గ్రేట్ ఎస్కేప్
అయితే, ఈ ప్రచారం అంతా ఊహాగానాలు అనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఒకేసారి సంకేతాలు పంపారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
By: Tupaki Political Desk | 7 Oct 2026 5:11 PM ISTస్థానిక ఎన్నికలు విసురుతున్న సవాళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాకచక్యంగా తప్పించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి తీసుకురావాలని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలను విజయవంతంగా ఎదుర్కొన్నారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి కట్టిన ఈ ఇద్దరు తమతో బీజేపీని కలుపుకుని గత 28 నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ కాలంలో ఇద్దరు నేతలు చక్కని సమన్వయంతో పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకునే పరిస్థితి ఉందనే అంచనాలు వెలువడగా, టీడీపీ వైఖరిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే, ఈ ప్రచారం అంతా ఊహాగానాలు అనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఒకేసారి సంకేతాలు పంపారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15 శాతం సీట్లు మాత్రమే ఇస్తామని టీడీపీ నుంచి జరిగిన ప్రచారం రెండు పార్టీల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. అప్పటి నుంచి కూటమిలో తమను తక్కువగా చూస్తున్నారని జనసేన నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తూ మరింత అగ్గి రాజేసినట్లు చెబుతున్నారు. జనసేనాని పవన్ తన పార్టీ శ్రేణులను సర్దుబాటు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల వల్ల తాము తలెత్తుకోలేకపోతున్నామని కార్యకర్తలు, నాయకుల నుంచి ఆయనపై ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు.
అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంలో తీవ్రమైన ఆలోచనకు లోనయ్యారని అంటున్నారు. రాష్ట్రం కోసం తాను, పవన్ మరో పదిహేనేళ్లు కలిసి పనిచేస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే కూటమి ఐక్యతకే దెబ్బ పడుతుందనే అంచనాతో సీట్ల సర్దుబాటుపై వెనువెంటనే కీలక నిర్ణయం తీసుకోవాల్సివుందని సీఎం భావించారని చెబుతున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను తన నివాసానికి ఆహ్వానించి స్థానిక ఎన్నికల విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు.
ఇందులో భాగంగా 2024 ఎన్నికల నాటి బలాబలాలతో సంబంధం లేకుండా, జనసేనకు సీట్లు కేటాయించాలని ముఖ్యనేతలు ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అవసరం అయితే మిత్రుడు పవన్ కోసం తమ పార్టీయే ఒక అడుగు వెనక్కి వేస్తుందని చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో పవన్ ఊపిరిపీల్చుకున్నారని చెబుతున్నారు. ఇక సీఎం నిర్ణయంతో జనసేన పోటీ చేద్దామని భావించిన చోట స్వేచ్ఛ లభించినట్లైందని అంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో భవిష్యత్తులో తలనొప్పులు రాకుండా ఉండాలని ఇద్దరు నేతలు ఒక అవగాహనకు వచ్చారని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం లేకుండా దిగువస్థాయిలోనే చర్చలు ముగించి, ఏకాభిప్రాయానికి రావాలని తద్వారా తమకు సంబంధం లేకుండా క్షేత్రస్థాయి నాయకుల అవగాహనతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
అవసరమైన పక్షంలో మాత్రమే జోక్యం చేసుకోవాలని, అదీ పరిస్థితులు చేజారిపోయే పరిస్థితి వచ్చినప్పుడే సర్దుబాట్లపై మాట్లాడాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీనిద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి స్థానిక ఎన్నికలలో పార్టీ శ్రేణుల ఒత్తిడి నుంచి సులువుగా బయటపడిపోయారని అంటున్నారు. స్థానికంగా పార్టీలు, నేతల బలాబలాలు ఆధారంగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉన్న నేతలకు అవకాశాలు దక్కే పరిస్థితి ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అత్యంత తెలివిగా తీసుకున్న నిర్ణయం ద్వారా పెద్ద అగాధం నుంచి బయటపడినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
