Begin typing your search above and press return to search.

జెడ్పీ పీఠాల వాటాలు...కూటమిలో లెక్క సెట్ అయిందా ?

ఏపీలో 28 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వినిపిస్తున్న ఫార్ములా ప్రకారం టీడీపీకి 22, జనసేనకు 5, బీజేపీకి ఒక జెడ్పీ పీఠం దక్కనున్నాయట. జనసేనకు పల్నాడు, శ్రీ సత్యసాయి, అల్లూరి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కడప జెడ్పీ పీఠం బీజేపీకి ఇచ్చి, ఆదినారాయణరెడ్డి సూచించిన అభ్యర్థిని ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By:  Satya P   |   7 Nov 2026 5:19 PM IST
జెడ్పీ పీఠాల వాటాలు...కూటమిలో లెక్క సెట్ అయిందా ?
X

ఏపీలో మొత్తం కొత్త జిల్లాలతో కలుపుకుని 28 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. దాంతో జెడ్పీ చైర్మన్ పదవులు కూడా 28 దాకా వస్తాయి. ఇందులో కూటమి పార్టీలు అన్నింటా విజయబావుటా ఎగరేసే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. దాంతో జెడ్పీ చైర్మన్ పదవులు ఎవరికి ఎన్ని అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. దానికి ఒక ఫార్ములా సెట్ చేసి ఉంచారని అంటున్నారు. ఆ ప్రకారం కూటమిలో ముగ్గురు మిత్రులు పంచుకోవడానికి అవగాహన కుదిరింది అని అంటున్నారు.

పెద్దన్నగా టీడీపీ :

ఇక చూస్తే ఈ మొత్తం 28 జడ్పీ పీఠాలలో 22 దాకా టీడీపీ తీసుకుంటుంది అని చెబుతున్నారు. అలాగే రెండవ పెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేనకు 5 ఇస్తారని అంటున్నారు. బీజేపీకి కూడా ఒక జెడ్పీ పీఠం దక్కే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మిత్రులు అంతా సాఫీగా సజావుగానే జెడ్పీ పీఠాల పంపకాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు అని భోగట్టాగా ఉంది అని చెబుతున్నారు.

జనసేనకు ఇవే :

ఇక జనసేనకు దక్కే జెడ్ చైర్మన్ పదవులు ఇవే అంటూ ప్రస్తుతం ప్రచారం అయితే సాగుతోంది. అవి ఏవి అంటే పల్నాడు జిల్లాతో పాటు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవులు జనసేనకు దక్కనున్నాయి. అలాగే, తిరుపతి జిల్లాలో జిల్లా పరిషత్ వైస్-చైర్‌పర్సన్ పదవి కూడా ఆ పార్టీకే లభించనుంది. అదే విధంగా మరిన్ని చోట్ల వైఎస్ చైర్మన్ పదవులు కూడా జనసేనకు ఇస్తారని అంటున్నారు.

కడపలో కాషాయం :

ఇక వైసీపీ అధినాయకత్వానికి సొంత జిల్లా అయిన కడప జడ్పీ పీఠం మీద బీజేపీ జెండా ఎగురుతుందని అంటున్నారు. ఎందుకంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీకి చెందిన సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి. ఆయన మొదటి నుంచి గట్టిగా పట్టు బట్టి ఉన్నారు. కడప పరిషత్తు ఎన్నికల్లో కూటమి బలాన్ని పెంచేందుకు ఆయన వంతు కృషి చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో కడప జడ్పీ పీఠం కచ్చితంగా ఆదినారాయణ రెడ్డి చెప్పిన వారికే దక్కుతుందని అంటున్నారు. ఇక టీడీపీ సైతం ఈ కీలకమైన రాజకీయ స్థానంలో జాతీయ పార్టీగా బీజేపీకి చెందిన వారే ఉండడం విస్తృత రాజకీయ వ్యూహంలో భాగంగానే అని అంటున్నారు. టీడీపీ సైతం దీనికి సమ్మతించినట్లుగా చెబుతున్నారు.

కొత్త చైర్మన్ ఆయనేనా :

ఇక బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు డాక్టర్ చాదిపిరాల రాజేష్ రెడ్డికి కడప జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి ఎంపిక చేస్తారు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. అదే సమయంలో టీడీపీకి చెందిన అనేక నాయకులు ఈ పదవి కోసం ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి మాట నెగ్గుతుందని అంటున్నారు. పరిషత్తు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఒకసారి కూర్చుని దీని మీద కూటమి పార్టీలు క్లారిటీ ఇస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఆఖరి నిముషంలో మార్పులు ఏవీ జరగకపోతే ఈ నంబర్లతోనే కూటమి మిత్రుల మధ్య జెడ్పీ పీఠాల పంపకం జరగవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.