Begin typing your search above and press return to search.

జనసేన నంబర్ ఇది... సీట్ల సర్దుబాటు ఉత్కంఠ !

స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తొందరలోనే నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది.

By:  Satya P   |   13 Oct 2026 8:05 PM IST
జనసేన నంబర్ ఇది... సీట్ల సర్దుబాటు ఉత్కంఠ !
X

స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తొందరలోనే నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది. ఇక కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఎడతెరిపి లేని చర్చలు సాగుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ స్థానిక పోరులో సీట్లను పంచుకోవడం మీదనే మొత్తం ఎన్నికల కధ అంతా ఆధారపడి ఉంది. ఏపీలో 17 మేయర్ స్థానాలు, 28 జెడ్పీ పీఠాలు 106 దాకా మున్సిపల్ చైర్మన్ సీట్లు ఉన్నాయి. అలాగే 661 దాకా ఎంపీపీ పదవులు, మరో 661 దాకా జెడ్పీటీసీ స్థానాలు, 9,913 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 3,884 దాకా అర్బన్ వార్డులు, 13,351 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో జనసేన 30 శాతం సీట్లు కావాలని కోరుతోంది. ఇక బీజేపీ కూడా తమకు 10 నుంచి 15 శాతం సీట్ల దాకా ఇవ్వాలని అడుగుతోంది అని ప్రచారంలో ఉంది.

ఆరు మేయర్ పీఠాలు :

ఇక జనసేన ఆరు మేయర్ పీఠాలను కోరుతోంది అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. అలాగే మొత్తం 106 మున్సిపల్ చైర్మన్ పదవులలో 26 జనసేన ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అని చెబుతున్నారు. ఇతర పదవులలో తమ వాటా తగ్గకుండా సమ న్యాయం చేయాలన్నది జనసేన వాయిస్ గా ఉంది అని అంటున్నారు. ఈ విషయం మీద సోమవారం ఒక దఫా చర్చలు జరిగాయి. చంద్రబాబుతో జరిగిన చర్చలలో జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఇక మంగళవారం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు జనసేన అధినేత పవన్ ని కలిసి సీట్ల సర్దుబాటు మీద చర్చించారు.అని అంటున్నారు. అయితే ఈ విషయం మీద తమ పార్టీ మంత్రి నాదెండ్ల తో పాటు ఎంపీ లింగమనేని రమేష్ లతో చర్చించాలని పవన్ సూచించారు అని అంటున్నారు.

అనుకున్న షేర్ కోసమే :

జనసేన అయితే తాము కోరుకున్నట్లుగా 30 శాతం సీట్లు దక్కాలని భావిస్తోంది. ఈ విషయంలోనే చర్చలు సాగుతున్నాయి. ఆరు మేయర్ పీఠాలు జనసేన కోరుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడాలని చూస్తోంది. అలాగే మునిసిపాలిటీలలో బలం పెంచుకోవడం, జెడ్పీ పీఠాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను కూడా సముచితమైన తీరులో తీసుకోవడం ద్వారా జనసేన భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తోంది. మరి ఈ సీట్ల లెక్క ఎలా తేలుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

బీజేపీ సైతం :

మరో వైపు బీజేపీ కూడా తన వాటా పెంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. మేయర్ పీఠాలతో పాటు జెడ్పీ పీఠాలు ఆ పార్టీ కోరుకుంటోంది అని అంటున్నారు. అదే విధంగా మండల పరిషత్తు చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లు నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీల దాకా కమలం పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా విస్తరించాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ విషయం మీద మరోసారి టీడీపీ అధినేత కూటమి పెద్ద చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ మాధవ్ చూస్తున్నారు.

అంతటా ఆసక్తి :

ఇదిలా ఉంటే కూటమి సీట్ల సర్దుబాటు విషయం మీదనే అంతటా చర్చ సాగుతోంది. ఎందుకంటే లోకల్ పోల్స్ మొత్తం ఈ సీట్ల సర్దుబాటు మీదనే ఆధారపడి ఉన్నాయి. సీట్ల సర్దుబాటు పక్కాగా కుదిరితే ఏపీలో కూటమి మరోసారి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధిస్తుంది అని అంటున్నారు. ఇక పట్టు విడుపులతోనే కూటమి పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుని ఒక కొలిక్కి తీసుకుని వస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో .