‘కోటి ఇళ్లకు తెలుగుదేశం’ - మంత్రి లోకేశ్ ట్వీట్ వైరల్
అధికార టీడీపీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. 40 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం శనివారం కోటి ఇళ్ల మైలురాయిని దాటినట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
By: Tupaki Political Desk | 4 Sept 2026 2:57 PM ISTఅధికార టీడీపీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. 40 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం శనివారం కోటి ఇళ్ల మైలురాయిని దాటినట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రెండేళ్ల కూటమి పాలనా విజయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా టీడీపీ అధిష్టానం ‘ఇంటింటికి తెలుగుదేశం’ ప్రారంభించింది. జూలై 27న మొదలైన ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. కేబినెట్ మినిస్టర్ నుంచి సామాన్య కార్తకర్త వరకు ప్రతి ఒక్కరూ ‘ఇంటింటికి తెలుగుదేశం’లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. ఇక పార్టీ శ్రేణులు సైతం అధిష్టానం ఆదేశాల ప్రకారం పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించిందని అంటున్నారు.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో కోటి ఇళ్లను సందర్శించారని మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ లో తెలిపారు. ‘‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో గొప్ప మైలురాయి స్థాపించారు’’ అంటూ మంత్రి కొనియాడారు. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.
కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన కార్యకర్తలను మంత్రి లోకేశ్ అభినందించారు. ఇక కోటి ఇళ్లకు టీడీపీ నేతలు వెళ్లారంటూ మంత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఇంతటి భారీ కార్యక్రమం నిర్వహించలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండగా, టీడీపీ ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్లి ఒక విడత ప్రచారం పూర్తిచేసినట్లుగా భావించాలని అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం కలిగిందని అంటున్నారు.
మరోవైపు కూటమి ప్రభుత్వంలో టీడీపీ సొంతంగా నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీ సొంతంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. అయినప్పటికీ ఎక్కడా మిత్రపక్షాల మనోభావాలను ప్రభావితం చేసేలా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో 40 రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు ప్రజల్లో ఉన్నప్పటికీ ఎక్కడా నిరసన స్వరాలు వినిపించకుండా కార్యక్రమం సాగడం కూడా ప్రభుత్వానికి సానుకూల సంకేతంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి నాలుగు కోట్ల ఓటర్లను పలకరించేలా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
