'ఇంటింటికీ' ఎఫెక్ట్: నేతలను కొలుస్తున్నారు..!
'ఇంటింటికీ కూటమి' పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమం పలు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
By: Garuda Media | 7 Aug 2026 12:34 AM IST'ఇంటింటికీ కూటమి' పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమం పలు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను, ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు. అదేసమయంలో ఒక ఇంట్లో ఎంత మేలు జరిగింది? ఎవరెవరికి ఏయే పథకాలు అందుతున్నాయన్న విషయాన్ని సమగ్రంగా వివరిస్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో నిర్విఘ్నంగానే సాగుతోంది.
ఈ కార్యక్రమం మొత్తాన్నీ మూడు అంచెలుగా పార్టీ విభజించింది. దీని ప్రకారం.. నాయకులను అంచనా వేస్తున్నారు.
1) కూటమి నాయకులను కలుపుకొని పోవడం: ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ప్రజల మధ్యకు వెళ్లే సమయంలో నాయకులు సరైన సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. కూటమి ఐక్యంగానే ఉందని ప్రజలకు స్పష్టం చేయాలి. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నేతలను కూడా కలుపుకొని పోవాల్సిన అవస రం ఏర్పడింది. అయితే.. ఈ విషయంలో మాత్రం నేతలు దాదాపు వెనుకబడుతున్నారు.
2) వైసీపీ లోపాలను ఎత్తి చూపడం: ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళ్తన్న నాయకులు ఈ విషయంలోనూ వెనుకబడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ.. తాము ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది ప్రజలకు వివరిస్తే.. తేడా తెలుస్తుందని పార్టీ అధినేత భావిస్తున్నారు. కానీ, రాజకీయంగా ఎందుకో ఈ విషయంలో నాయకులు చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే దీనిని ప్రాధాన్య అంశంగా చూస్తుండగా.. మిగిలిన జిల్లాల్లో ఈ విషయాన్ని వదిలేస్తున్నారు.
3) స్థానిక కేడర్‌ను బలోపేతం చేయడం: స్థానికంగా ఉన్న టీడీపీ కేడర్‌ను బలోపేతం చేయాలన్న ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో ఇమిడి ఉంది. ఈ విషయంలో చాలా వరకు నాయకులు ప్రయత్నాలు చేస్తు న్నారు. కేడర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇంటింటికీ కార్యక్రమంలో భారీ ఎత్తున కేడర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటి ఆధారంగానే నాయకులపై పార్టీ ఒక అంచనాకు వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత.. పదవులు ఇవ్వాలన్నా.. దీనినే కొలమానంగా తీసుకుంటారని.. తాజాగా మరోసారి పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పడం గమనార్మం.
