Begin typing your search above and press return to search.

బాబు గారూ.. ఇది త‌గునా: ఎమ్మెల్యేల గుస్సా ..!

అధికార కూటమి పార్టీల్లో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

By:  Garuda Media   |   31 July 2025 7:00 AM IST
బాబు గారూ.. ఇది త‌గునా:  ఎమ్మెల్యేల గుస్సా ..!
X

అధికార కూటమి పార్టీల్లో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కీలక సమయాల్లో అందరినీ ఒకే తాటి పైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కూటమిలోని నాయకులు కలిసి ఉండాలని పదేపదే చెబుతున్నారు. అయినా రాజకీయాల పరంగా ఎలా ఉన్నప్పటికీ వ్యాపారాలు సెటిల్మెంట్లు విషయంలో మాత్రం నాయకుల మధ్య ఆదిపత్య పోరు ఎక్కువగానే కనిపిస్తోంది.

దీనిని అంత సామాన్యంగా తీసేయడానికి లేదు. ఇసుక, మద్యం అలాగే ఇతర వ్యవహారాలు కూడా కూటమి నాయకుల మధ్య క్షేత్రస్థాయిలో అంతర్గతంగా వివాదాలకు విభేదాలకు దారి తీసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై టిడిపి నాయకులు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలపై టిడిపి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి వైసీపీ నుంచి వచ్చిన కీలక నాయకుడికి తక్కువ ధరలకే భూములు కేటాయించడం. వ్యాపారాలకు ప్రభుత్వం అండగా నిలవడం.

రెండోది టిడిపిలో ఉన్న నాయకులకు ఏమాత్రం సహకారం లేదనేది వారి వాదన. ఈ పరిణామంతో అంతర్గతంగా మరింత విభేదాలకు దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారధికి, మచిలీపట్నం ఎంపీ బాల సౌరికి ప్రభుత్వం తాజాగా భూములు కేటాయించింది. అదేవిధంగా వారికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహకారాలు అందించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి వీరిద్దరూ కూడా వైసిపి నుంచి ఒకరు టిడిపిలోకి, మరొకరు జనసేనలోకి వచ్చిన నాయకులే.

వీరికి సాయం చేయడాన్ని టిడిపి నాయకులు తప్పు పట్టక పోయిన, తమకు ఎందుకు సాయం చేయడం లేదన్నది వారి ఆవేదన. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కీల‌క సామాజిక వర్గం ఎమ్మెల్యే ఇటీవల భూముల కేటాయింపులకు సంబంధించి అర్జీ పెట్టుకున్నారు. కానీ దానిని ప్రభుత్వం తిరస్కరించింది. అలాగే విశాఖపట్నం కి చెందిన ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కూడా తనకు భూములు కేటాయించాలని కంపెనీ పెట్టుకుంటాన‌ని కోరారు. కానీ అక్కడ కూడా ప్రభుత్వం దరఖాస్తును పక్కనపెట్టింది. ఇలా కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్న మాట వాస్తవం.

వారిని కాదని వీరిని చేరతీయటం ఏంటి అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి ఈ విషయంలో ప్రత్యర్థులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలపరంగా కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో టిడిపిలో కూడా అంతర్గతంగా ఇది వివాదానికి దారి తీయడం, ఈ విషయంపై నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరుగుతుండడం గ‌మ‌నార్హం. ఇలాంటి వాటిపై చంద్ర‌బాబు మ‌రోసారి ఆలోచ న చేయాల‌ని వారు కోరుతున్నారు.