కారు ఆపకుండా వెళ్లిపోయిన హోంమంత్రి.. స్పాట్ నుంచే మాజీ ఎమ్మెల్యే ఫోన్..
ముఖ్యంగా హోంమంత్రి అనిత వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు ఆ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్పేస్తున్నారు.
By: Tupaki Gallery Desk | 25 Jan 2026 3:55 PM ISTఅనకాపల్లి జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి అనిత వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు ఆ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్పేస్తున్నారు. మమ్మల్ని అవమానిస్తారా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంత్రి అనకాపల్లి పర్యటన సందర్భంగా ఆదివారం చోటుచేసుకున్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆదివారం అనకాపల్లి వచ్చిన హోంమంత్రి అనితతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా, మంత్రి కారు ఆపకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై ఆయన నేరుగా హోంమంత్రికే ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
హోంమంత్రి అనితకు ఫోన్ చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తమకు ఎదురవుతున్న అవమానాలపై ఏకరువు పెట్టారు. తాను ఎమ్మెల్యేని కాదన్న ఆలోచనతో చిన్నచూపు చూస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తాను సహచర నేతలతో కలిసి మీతో మాట్లాడేందుకు రోడ్డుపై వేచి ఉన్నామని, కారు ఆపుతుండగా, డ్రైవర్ వెళ్లిపోవడం ఏంటని మంత్రికి ఫోన్ లో నిలదీశారు. అటువైపు నుంచి హోంమంత్రి మాట్లాడుతూ మిమ్మల్ని చూడలేదని, చూస్తే అలా వెళ్లిపోయేదాన్ని కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై మరింత ఘాటుగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ తాము మిమ్మల్ని తప్పు పట్టడం లేదని, మీ సిబ్బంది తీరు సరిగా లేదంటూ చెబుతున్నామని వ్యాఖ్యానించారు.
అనకాపల్లిలో టీడీపీ నేతలకు విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే పీలా. ప్రభుత్వ కార్యక్రమాలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇటీవల అడ్డురోడ్డు డివిజన్ కార్యాలయం ప్రారంభించిన సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు పర్యటించిన ఆ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వరా? అంటూ నిలదీశారు. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తాము మంత్రుల పర్యటనకు రావాల్సివచ్చిందని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము అధినేత చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. మమ్మల్ని అన్నిరకాలుగా అవమానిస్తున్నారని, రోడ్డుపైకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అనకాపల్లి ఉత్సవాలకు పాసులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హోంమంత్రి అనిత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రితో మాజీ ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న కార్యకర్త ఎవరో ఆ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వీడియోలో మంత్రి అనిత మాట్లాడిన మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో జనసేన నేత కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటును కేటాయించారు. దీంతో చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పోటీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం చర్చనీయాంశంగా మారింది.
