టీడీపీ హాట్ డిబేట్: ఈ వాదనే బలపడితే.. ఎవరికి ప్రమాదం!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది కీలకం. ఇది వ్యక్తులకే కాదు.. నాయకులకు కూడా వర్తిస్తుంది.
By: Garuda Media | 25 Oct 2025 5:00 AM ISTఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది కీలకం. ఇది వ్యక్తులకే కాదు.. నాయకులకు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో కేవలం డబ్బు మాత్రమే ప్రామాణికం కాదు.. విధేయత-వినయంతో అనేక మంది నాయకులు పద వులు సంపాయించుకున్నారు. ఆ పదవులకు గౌరవం కూడా తెచ్చిపెట్టారు. అయితే..రాను రాను.. రాజ కీయాల్లో విధేయ అన్న పదం వినిపించడం లేదు. కనిపించడం లేదు. తమ తమ కోరికలు నెరవకపోతే నో.. తమకు ఏ చిన్న ఇబ్బంది వస్తేనో.. నాయకులు వెంటనే రోడ్డెక్కుతున్నారు.
పార్టీని.. పార్టీ అధినేతను కూడా రోడ్డున పడేస్తున్నారు. ఇది ఆ పార్టీ.. ఈ పార్టీ అనే ప్రశ్నకాదు.. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ ఇలానే రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే.. గత కొన్నాళ్లు గా టీడీపీ ఎమ్మెల్యేలు.. వివాదాలతో కలివిడిగా ముందుకు సాగుతున్నారన్నది వాస్తవం. పేర్లు పక్కన పెడితే.. కీలక నాయకులు.. ఎమ్మెల్యేలు.. కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు పార్టీలైన్‌ను కూడా దాటేశారు. ఈ విషయాలన్నీ ప్రత్యర్థుల మీడియాలో వస్తే.. ఆశ్చర్యం వచ్చేది.
కానీ, టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థల నుంచే వస్తున్నాయి. కీలకమైన ఇసుక, మద్యం .. వ్యవహారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న చర్చ కూడా ఉంది. అయితే.. ఇలాంటి వారిపై పార్టీ అధినేత చంద్రబాబు తరచుగా హెచ్చరికలు చేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ సంఘం ముందు అలాంటి వారిని నిలబెడుతున్నారు. అప్పటికప్పుడు వార్నింగులు ఇస్తున్నారు. ``ఇంకోసారి చేస్తేనా?`` అంటూ పళ్లు బిగిస్తున్నారు. కానీ, ఓ నాగులు రోజుల తర్వాత.. మళ్లీ కథ మామూలే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల విషయాన్ని ప్రస్తావించారు. వీరిని లైన్‌లో పెట్టే బాధ్యత మంత్రులదేనన్నారు. వాస్తవానికి అసలు చిచ్చు అక్కడే ఉందన్న వాదన ఉంది. ఇంచార్జ్ మంత్రులకు.. జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు ఎక్కడా పొసగడం లేదు. ఇక, ఆ తర్వాత ఆధిపత్య ధోరణులు.. మొత్తానికి సమస్యల మూలాలు ఇవి.
కానీ.. వీటిని పరిష్కరించాల్సి న పార్టీ అధినాయకత్వం.. నాయకుల పట్ల చాలా సుతిమెత్తగా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. మరికొందరు అయితే.. పార్టీపై పట్టుపోతోందన్న కామెంట్లు కూడా చేస్తున్నారు. సో.. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు ఒకరిద్దరిపైనైనా.. సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు కోరుతున్నారు. బలమైన సంకేతాలు పంపించాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు.
