టీడీపీకి ఇది కొత్త కాదు... అదే పెద్ద ప్రాబ్లమ్...!
ఎవరూ దాచుకోవడం లేదు. ఎంపీల దూకుడు కారణంగా తమకు ప్రాధాన్యం లేకుండాపోయిందన్నది వారి వాదన.
By: Garuda Media | 27 Oct 2025 12:00 PM ISTప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య కొనసాగుతున్న వివాదాలకు కీలక కారణం.. ఆధిపత్యం. కొన్నాళ్ల కిందట గుంటూరులోను.. తర్వాత, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలులోను వెలుగు చూసిన తీవ్ర వివాదాలకు.. ఎంపీలు-ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణమని గుర్తించారు. ఇక, ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య నెలకొంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు.
ఎవరూ దాచుకోవడం లేదు. ఎంపీల దూకుడు కారణంగా తమకు ప్రాధాన్యం లేకుండాపోయిందన్నది వారి వాదన. అయితే.. ఎంపీల వాదన మరో విధంగా ఉంది. ఎంపీలాడ్స్ నుంచి నిధులు వెచ్చిస్తున్నామని .. అభివృద్ధి కార్యక్రమాలన్నీ.. తామే చేపడుతున్నామని.. కాబట్టి తమకు సహకరించాలని వారు ఎమ్మెల్యే లను కోరుతున్నారు. నిజానికి 7-8 ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కలిపితేనే ఎంపీ నియోజకవర్గం అవుతుంది. ఎంపీలకు ప్రత్యేకంగా నియోజకవర్గం ఉండదు.
వారు ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం తప్పుకాదు. కానీ, సొమ్ములు వెచ్చిస్తున్నాం కాబట్టి తమదే పైచేయి కావాలన్న ధోరణి కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఏపీలో మాత్రమే ఈ సమస్యలేదు. ఇలాంటి సమయంలో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుంది. గతంలో వైసీపీ హయాంలో నూ.. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీల మధ్య వివాదానికి ఎంపీ లాడ్సే కారణమయ్యాయి. ఫలితంగా ఇది ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీల మధ్య ఇగోకు దారి పార్టీ నష్టపోయింది.
అలాంటి పరిస్థితే ఇప్పుడు టీడీపీలోనూ కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే.. బీజేపీ ఎంపీల వ్యవహారం కూడా ఇలానే ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సో.. ఈ సమస్యకు పరిష్కారం ఆధిపత్య ధోరణిని నివారించడం. అందరినీ కలుపుకొని పోయేలా నాయకులను సమన్వయం చేయడం. ఇది చేయనంత కాలం.. నేతల మధ్య వివాదాలు ఇలా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి.. ఇలాంటి వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు తరచుగా వారితో చర్చించడం.. ఇగోలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కీలకమన్నది రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ.
