కర్నూలు బాధితులకు టీడీపీ సభ్యత్వ బీమా ఎంతా వేగంగా అంటే..!
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వి.కావేరీ బస్సు కర్నూలు వద్ద జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదానికి గురైన భయంకరమైన ఘటన అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 25 Oct 2025 12:50 PM ISTహైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వి.కావేరీ బస్సు కర్నూలు వద్ద జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదానికి గురైన భయంకరమైన ఘటన అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న ఇద్దరు బాధితులకు చంద్రన్న ప్రమద బీమా అండగా నిలిచింది.
అవును... కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వీ.కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవదహనం అవ్వగా.. మృతుల్లో ఇద్దరు తెలుగు దేశం పార్టీ సభ్యత్వం కలిగిన వారు ఉన్నారు.
వారు నెల్లురుకు చెందిన గొల్ల రమేష్, ఆయన భార్య అనూష. వీరిద్దరూ నమోదిత టీడీపీ సభ్యులుగా ఉన్నట్లు గుర్తించిన వెంటనే.. పార్టీ త్వరగా చర్య తీసుకుని టీడీపీ సభ్యత్వంతో వచ్చే ఉచిత ప్రమాద బీమాను ప్రాసెస్ చేసింది. టీడీపీ సభ్యత్వానికి అధికారిక బీమా భాగస్వామి అయిన యునైటెడ్ ఇన్సూరెన్స్ ను పార్టీ కార్యకర్తలు సంప్రదించి ఆరు గంటల్లోనే ప్రక్రియను పూర్తి చేశారని తెలుస్తోంది.
దీంతో ఈ పాటికే వారి కుటుంబాలకు డబ్బు అందేదే కానీ.. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నాటికి డబ్బు జమ చేయగలరని చెబుతున్నారు. కాగా... టీడీపీ సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం ఉందన్న సంగతి తెలిసిందే. 2024 ఏడాది అక్టోబర్ 26న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
బిడ్డను గుండెలకు హత్తుకుని కాలిపోయిన అనూష!:
కర్నూలులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. వారి వివరాలు.. గొల్ల రమేశ్ (35), ఆయన భార్య అనూష (30), కుమార్తె మన్విత (10), కుమారుడు మనీశ్ (12).
అయితే.. బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో అనూష తన కుమార్తె మన్వితను ఎలాగైనా కాపాడాలని గుండెలకు హత్తుకుని గట్టిగా పట్టుకున్నారు. ఆ సమయంలో.. అప్పర్ బెర్త్ నుంచి కిందకి దిగేసరికే మంటలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో అనూష, తన చేతిలోని కుమార్తెతో సహా కాలిపోయి మాంసపు ముద్దలా మారిపోయారు.
