టీడీపీ చరిత్రలో సువర్ణాధ్యాయం...తెలుగునాట నవోదయం
ఇక వివరాల్లోకి వెళ్తే 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అప్పటి వెండితెర సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీ అని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు.
By: Satya P | 7 Jan 2026 8:59 PM ISTతెలుగుదేశం పార్టీ పుట్టుక ఒక చరిత్ర. అది ఒక విప్లవం. అది ఒక ప్రభంజనం. అది ఒక సునామీ ఇలా ఎన్ని చెప్పినా తక్కువే అంతకు మూడున్నర దశాబ్దాల ముందు ఏకధాటీగా ఒకే పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉంది. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే పాలన వారే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. విశాలాంధ్రాలో సైతం అదే సాగింది. దానికి అతి పెద్ద బ్రేక్ వేస్తూ కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే తెలుగుదేశం అని ఒక పార్టీ అప్పటికి తొమ్మిదిన్నర దశాబ్దాల వయసు కలిగిన కాంగ్రెస్ ని ఢీ కొట్టి ఓడించడం అంటే అది ఒక గొప్ప చరిత్ర అని అంతా అంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అలా ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు, అందుకే ఆ ఘన విజయం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
టీడీపీ సూపర్ హిట్ :
ఇక వివరాల్లోకి వెళ్తే 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అప్పటి వెండితెర సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీ అని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆ తరువాత ఆయన తొమ్మిది నెలల పాటు చైతన్య రధం మీద ఉమ్మడి ఏపీ అంతటా తిరిగారు. అలా తొమ్మిది నెలలలో వచ్చిన ఎన్నికలను ఎదుర్కొన్నారు. అంతే కాదు ఏకంగా 200 దాకా సీట్లు సాధించి సీఎం అయిపోయారు. దానికి ఆనాటి ఒక ప్రముఖ దిన పత్రిక పెట్టిన హెడ్డింగ్ తెలుగుదేశం సూపర్ హిట్ అని. అంతే కాదు ఎన్టీఆర్ విజయదరహాసంతో ఉన్న నిలువెత్తు ఫోటోని ఒక వైపు వేస్తే మరో వైపు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ విషాద వదనంలో కూర్చుని తల మీద చేయి పెట్టుకున్నట్లుగా ఉన్న మరో ఫోటో వేసింది. ఇక్కడ టీడీపీ సూపర్ హిట్ అని రాయడానికి ఒక అందం అర్థం ఉంది. ఎన్టీఆర్ సినీ నటుడు, ఆ ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయాల్లో విజయం సాధించారు, దాంతో సినీ పరిభాషలోనే ఈ విజయాన్ని ఆ పత్రిక రాస్తూ హైలెట్ చేసింది అన్న మాట.
అదంతా ఒక అద్భుతం :
ఇక 1983 జనవరి 5న ఉమ్మడి ఏపీలోని 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మొత్తం సీట్లకు పోటీ చేస్తూ ఒకటి రెండు సీట్లు ఇందిరాగాంధీ రెండవ కోడలు మేనకాగాంధీ ఏర్పాటు చేసిన సంజయ్ విచార్ మంచ్ కి కేటాయించింది. అలా ఆ పార్టీ నుంచి ఒకరిద్దరు నెగ్గారు. టీడీపీ సొంతంగా గెలిచింది. ఆనాడు బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగాయి. దాంతో పోలింగ్ ముగిసిన వెంటనే 6వ తేదీన కౌంటింగ్ మొదలెట్టారు. అలా 6వ తేదీ ఉదయం నుంచే ట్రెండ్స్ తెలిసినా టీడీపీ ఆధిక్యత సాధించింది అని తెలియడానికి అర్ధరాత్రి దాటింది. దాంతో టీడీపీ విక్టరీ వార్తను 1983 జనవరి 7వ తేదీన పేపర్ లో ప్రచురించడం జరిగింది. ఆనాటి పేపర్లు కూడా హాట్ కేకుల మాదిరిగా అమ్ముడు పోవడం ఒక విశేషంగా చెప్పుకున్నారు ఇక జనవరి 9న ఎన్టీఆర్ సీఎం గా ప్రమాణం చేశారు. అంతే కాదు రాజ్ భవన్ లో ఎపుడూ ప్రమాణ స్వీకారాలు జరిగే దానిని ఎన్టీఆర్ మార్చి ఎల్బీ స్టేడియంలో ప్రజలందరి సమక్షంలో ప్రమాణం చేయడం అప్పట్లో మరో పెద్ద ముచ్చటగా చెప్పుకున్నారు. మొత్తానికి టీడీపీ అది లగాయితూ ఎన్ని విజయాలు సాధించినా తొలి విజయం మాత్రం ఎంతో మధురమైనది అపురూపమైనది అని చెప్పక తప్పదు, ఆ విజయాన్ని ప్రతీ ఏటా టీడీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనాటి టీడీపీ ఘన విజయానికి సంబంధించిన సమాచారం అందరికీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
