ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కోలా.. బాబు పాలనలో ఇదే ఫస్ట్ టైం?
ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పలు విషయాలు ప్రభుత్వంలో సమన్వయలోపాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు.
By: Tupaki Political Desk | 28 Sept 2025 5:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా ఎంతో క్రమశిక్షణ ఉంటుందనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకతకు కూడా పెద్దపీట వేస్తారని, టెక్నాలజీ సాయంతో అంతా పక్కాగా నిర్వహిస్తారని చెబుతుంటారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి నేటి వరకు చంద్రబాబు పాలన అంటే ఓ పద్ధతి ప్రకారం సాగుతుందని జాతీయస్థాయిలో పేరుంది. కానీ, గత ఏడాది నాలుగోసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. ఇది ఎవరో చేసిన విమర్శ కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన మాటల ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
ఔను.. చంద్రబాబు 4.0 సర్కారులో తడబాటు కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో మంత్రుల మధ్య కూడా సమన్వయం ఉండటం లేదని చెబుతున్నారు. ఒకే అంశంపై తలా ఒకలా స్పందించడమే ఇందుకు నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంలో తన సహచరులపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు గతానికి భిన్నంగా నడుచుకుంటున్నారని, అసెంబ్లీకి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర అంశాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పలు విషయాలు ప్రభుత్వంలో సమన్వయలోపాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. ఎవరికి వారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో జరిగిన అప్పులను ప్రస్తావిస్తూ ఇంకా అబద్దాలు చెబుతున్నారన్నది ప్రధాన విమర్శ. ఈ విషయాన్ని అధికార పార్టీ సభ్యులే గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సభల్లోనే గత ప్రభుత్వంలో చేసిన అప్పులపై భిన్న ప్రకటనలు రావడం గమనార్హం. జగన్ హయాంలో 3 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పగా, మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు తదితరులు వైసీపీ హయాంలో 9 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు.
ఇక వైసీపీ హయాంలో రహదారులు నిర్మించలేదని ఆది నుంచి ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా ఇటీవల అసెంబ్లీలో మంత్రి బసీ జనార్దన్ రెడ్డి ప్రకటన చేశారని అంటున్నారు. గత ప్రభుత్వంలో 32 శాతం మేర రహదారుల నిర్మాణం జరిగిందని మంత్రి చెప్పడంతో టీడీపీ తన ప్రకటనపై డైలమాలో పడిపోయిందని అంటున్నారు. ఇక మెడికల్ కాలేజీల విషయంలోనూ స్పష్టత కనిపించడం లేదని అంటున్నారు. మొత్తం 17 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అసలు కాలేజీలను నిర్మించలేదని అందుకే పీపీపీకి ఇస్తున్నట్లు తెలిపింది. వాస్తవం వచ్చేసరికి మరుసటిరోజు మంత్రి సత్యకుమార్ మండలిలో మాడ్లాడుతూ, 5 కాలేజీలు పూర్తయ్యాయని వివరించారు.
