Begin typing your search above and press return to search.

కండువా క‌ప్పేశారు స‌రే.. ప‌ర్స‌న‌ల్ స్ట్రెంగ్త్ ఎంత బాబూ.. !

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన ముగ్గురు ఎమ్మెల్సీల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

By:  Garuda Media   |   22 Sept 2025 10:15 AM IST
కండువా క‌ప్పేశారు స‌రే.. ప‌ర్స‌న‌ల్ స్ట్రెంగ్త్ ఎంత బాబూ.. !
X

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన ముగ్గురు ఎమ్మెల్సీల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగతంగా ఒక నాయకుడు పార్టీ మారితే వారి వల్ల ఆ పార్టీకి మరింత బలం చేకూరాలి. ప్రజల్లోనూ బలమైన సంకేతాలు రావాలి. సహజంగా ఏ పార్టీ అయినా ఇదే కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో బలమైన నాయకులకు పార్టీలు ఎప్పుడు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి. ఈ కోణంలో చూసుకుంటే తాజాగా వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్సీలలో ఎవరి బలం ఎంత? ప్రజల్లో వారికి ఉన్న గ్రాఫ్ ఎలా ఉంది వంటి అంశాలను టిడిపి నాయకులు సహా వైసిపి నేతలు కూడా అంచనా వేస్తున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ వరుస పరాజయాలతో ఉన్న విషయం తెలిసిందే. పైగా నియోజకవర్గంలో ఆయనకు బలమైన పేరు ఉన్నప్పటికీ దానిని ఓటు బ్యాంకు గా మార్చుకునే విషయంలో రాజశేఖర్ వెనుకబడ్డారు. కేవలం 2009 ఎన్నికల్లో మాత్రమే ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ తో విజయం దక్కించుకున్నారు... అన్న వాదన కూడా ఉంది. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు కర్రి పద్మశ్రీ ఎప్పుడు దూరంగానే ఉన్నారు. కాబట్టి ఆమె వల్ల కూడా టిడిపికి ప్రత్యక్షంగా వన‌గూరే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు.

యువ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి విషయానికి వస్తే ఈయన కూడా ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తండ్రి దుర్గాప్రసాద్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్సీ గానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీరికి ఉన్న బలం ఎంత? ప్రజల్లో ఆదరణ ఎంత? అనేది ప్రశ్నార్ధకంగానే ఉంది. దీనిని బట్టి వీరికి వ్యక్తిగతంగా ప్రజల్లో ఉన్న ఇమేజ్ గాని ప్రజల్లో ఉన్న బలంగాని ఏమీ లేదన్నది పార్టీ నాయకులు చెబుతున్నారు. వీళ్ళు కేవలం రాజకీయంగా టిడిపిని అడ్డుపెట్టుకునేందుకు మాత్రమే ఉపయోగపడతారని చెబుతున్నారు.

వీరి వల్ల పార్టీకి ప్రత్యేకంగా వచ్చే బలం కానీ వచ్చే సానుభూతి కానీ ఏమీ ఉండదని కూడా చెబుతున్నారు. కేవలం వైసీపీని ఇరుకున పెట్టేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అన్నది వారి వాదన. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లేక‌పోతే.. వీరితో మ‌రింత చిక్కు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంద‌న్న లెక్క‌లు కూడా వ‌స్తున్నాయి. అప్పుడు మ‌ళ్లీ వీరితో త‌ల‌నొప్పేన‌ని కూడా అంటున్నారు. ఏది ఏమైనా తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఏ మేరకు టిడిపికి ఉపయోగపడతారనేది చూడాలి.