మేయర్ చైర్మన్లకు డైరెక్ట్ ఎలక్షన్స్...టీడీపీ కొత్త ఎత్తుగడ ?
ఇదిలా ఉంటే టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చర్చ సాగుతోంది.
By: Satya P | 27 July 2026 9:25 AM ISTస్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కూటమి సర్వం సిద్ధం చేసుకుంటోంది. అక్టోబర్ లో ఎన్నికలకు ముహూర్తం కూడా నిర్ణయించింది. ఇదిలా ఉంటే టీడీపీ ఈసారి ఎన్నికల విషయంలో కొత్త ఎత్తుగడలతో ముందుకు రాబోతోంది అని ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే స్థానిక సంస్థలలో కీలక పదవులకు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలని సీరియస్ గా ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. దాని వల్ల టీడీపీ కూటమికి భారీ లబ్ది సమకూరుతుందని అంటున్నారు. అంతే కాదు ప్రజలు ఎన్నుకున్న వారి మీద అవిశ్వాసం పెట్టెందుకు వీలు ఉండదు, ఇక ఎక్కువ తక్కువ సంఖ్య, కోరంలు నెగ్గిన సభ్యులతో కుర్చీలాటలు నంబర్ గేమ్స్ అన్నది అసలు ఉండవని కూడా లెక్క వేస్తోంది.
సీట్ల సర్దుబాటుకి వ్యూహం :
ఇదిలా ఉంటే టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చర్చ సాగుతోంది. ఈ మధ్యనే ఒక ప్రచారం బయటకు వచ్చింది. టీడీపీ 80 శాతం, జనసేన 15 శాతం బీజేపీ అయిదు శాతం సీట్లకు పోటీ చేయాలని అన్నట్లుగా ప్రచారం సాగింది. దాని మీద జనసేన నుంచి గట్టిగానే జవాబు వచ్చింది. అలా కుదరదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దాంతో ఇపుడు సీట్ల సర్దుబాటు విషయంలో కొత్త వ్యూహంతో టీడీపీ ఉందని అంటున్నారు. అందుకే డైరెక్ట్ ఎలక్షన్స్ కోసం టీడీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు.
ముందుగానే పదవులు :
డైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల ముందుగానే పదవులు తీసుకోవడం జరుగుతుందని అలా తీసుకున్న తరువాత ఏ విధమైన అవిశ్వాసం బెడద లేకుండా అయిదేళ్ళ పాటు ఆ పదవులలో ఆయా పార్టీల వారే ఉంటారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే కనుక మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు 30 నగర పంచాయతీలతో కలిపి మొత్తం 108 పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి. అలాగే 688 మండల పరిషత్తులు ఉన్నాయి. జిల్లా పరిషత్తుల సంఖ్య అధికారికంగా 13గా కొనసాగుతున్నప్పటికీ, కొత్త జిల్లాల ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ జరుగుతోంది కాబట్టి 28 జిల్లా పరిషత్తులు వస్తాయి. వీటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ మేయర్ పదవులతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవులు అలాగే మండల పరిషత్తు చైర్మన్ పదవులు కూడా పంచుకుంటాయని అంటున్నారు. అలా చేయడం వల్ల ఎవరికి ఎన్ని పదవులు అని ఎన్నికల కంటే ముందే ఒక క్లారిటీ వస్తుందని దాంతో ఎన్నికల వేళ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పార్టీలు సమిష్టిగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని అది సంపూర్ణ విజయానికి కారణం అవుతుందని భావిస్తున్నారు.
టీడీపీ తెచ్చిన ప్రయోగం :
ఇక స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు అన్నది టీడీపీ తెచ్చిన ప్రయోగమే అని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక 1986 1987లలో నిర్వహించిన లోకల్ బాడీ ఎన్నికల్లో మేయర్ సహా జిల్లా పరిషత్తు చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మండలాల చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెట్టారు. దాని వల్ల అయిదేళ్ళ పాటు వారు ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రజా సమస్యల మీదనే దృష్టి నిలిపి పనిచేశారు. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ పరోక్ష ఎన్నికల విధానాన్ని తీసుకుని వచ్చింది. ఇపుడు టీడీపీ ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తిరిగి తేబోతోంది అని అంటున్నారు. ఇది కనుక అమలు చేస్తే ప్రజలు కూడా ఉత్సాహంగా తమ మేయర్ ని తమ జిల్లా పరిషత్తు చైర్మన్ ని ఎన్నుకుంటారు అని అంటున్నారు. ఈ విధానం ద్వారా అధికార కూటమికే రాజకీయంగా లాభమని కూడా అంటున్నారు.
