ఏంటీ కథలు.. టీడీపీలో గుబులు ..!
ఏపీ అధికార కూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో గుబులు రేగింది. అసలు పార్టీలో ఏం జరుగుతోందన్న విషయంపై కీలక నాయకులు దృష్టి పెట్టారు.
By: Garuda Media | 4 Aug 2025 10:00 PM ISTఏపీ అధికార కూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో గుబులు రేగింది. అసలు పార్టీలో ఏం జరుగుతోందన్న విషయంపై కీలక నాయకులు దృష్టి పెట్టారు. చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన కదిలిన సీనియర్ నేతలు.. ఇద్దరు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అధ్యయనం చేయనున్నారు. దీనికి కారణం .. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వస్తున్న వ్యతిరేక కథనాలే!. కొన్ని రోజుల కిందట ఓ మంత్రి వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
ఆయన దోచుకుంటున్నారని.. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చి... ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సుమారు 50 కోట్ల సొమ్మును సొంతం చేసుకుంటున్నారని.. టీడీపీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే ఓ మీడియా వెలుగులోకి తెచ్చింది. దీనిపై అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందించినా.. జరగాల్సిన పని జరిగిపోవడంతో ఆయన సదరు మంత్రిని కేబినెట్ సమావేశం అనంతరం.. మందలించి వదిలేశారని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత.. తాజాగా గుంటూరుకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సహా.. శ్రీకాకుళానికి చెందిన మరో ఎమ్మెల్యే పైనా.. ఇలాంటి వార్తలే వచ్చాయి. పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం అయ్యాయి. అటు టీవీలోను, ఇటు పత్రికల్లోనూ వచ్చిన కథనాలు.. పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఇది నిజమేనా? నిజమైతే.. వారు ఎందుకు అలా చేస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవాలని.. 48 గంటల్లో నివేదిక తనకు అప్పగించాలని చంద్రబాబు పార్టీ సీనియర్లు, ముఖ్యంగా క్రమశిక్షణ సంఘంలో ఉన్న వారికి ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుంటే.. ఇలా వ్యతిరేక కథనాలు, వార్తలు రావడం వెనుక రెండు కారణాలు ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలోనే కొందరు మీడియాకు ఉప్పందిస్తున్నారని.. తమను బద్నాం చేసేందుకు వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే.. ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. నిజంగానే జరుగుతున్నాయని.. కాబట్టే కథనాలు వస్తున్నాయని అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వారు అంటున్నారు. ఈ పరిణామాలు.. టీడీపీలో చర్చగానే కాకుండా.. ఆసక్తిగా మారాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
