మంత్రులూ బీ రెడీ...బాబు అలెర్ట్ !
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అటు పరిపాలనను చూసుకుంటోంది.
By: Satya P | 14 March 2026 12:00 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అటు పరిపాలనను చూసుకుంటోంది. ఇటు రాజకీయంగా కూడా తమదే పైచేయిగా ఉండాలని ఆరాటపడుతోంది. 2024 లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 56 శాతం పైగా ఓటు షేర్ కూటమికి దక్కింది. దాంతో దానిని నిలబెట్టుకోవడమే కాదు అవసరం అయితే ఆ నెంబర్ ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. దానికి కారణం అధికారంలోకి వచ్చాక గత 21 నెలలలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చింది అని గట్టిగా చెబుతోంది. సూపర్ సిక్స్ హామీలను కూడా నూరు శాతం అమలు చేస్తున్నామని అంటోంది.
విపక్షానికి నో చాన్స్ :
ఏపీలో చూస్తే ప్రధానమైన మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఒకటిగా కూటమి కట్టాయి. విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ అయితే ఉనికి పోరాటం చేస్తున్నాయి. దాంతో వైసీపీ మీదనే కూటమి రాజకీయ యుద్ధం అంతా చేస్తోంది. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో దాదాపుగా నలభై శాతం ఓటు షేర్ దక్కింది. దాంతో వైసీపీని లైట్ తీసుకోరాదని భావిస్తోంది. ఇక ఏపీలో కూటమి బలంగా ఉందని ప్రభుత్వం పనితీరు పట్ల జనంలో సంతృప్తిగా ఉందని కూడా పెద్దలు నమ్ముతున్నారు ఈ నేపధ్యంలోనే మరిన్ని విజయాలను నమోదు చేయడం ద్వారా వైసీపీని నైతికంగా దెబ్బ తీయాలని అనుకుంటున్నారు.
గెలుపు మనదే :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఉన్నాయి. ఈ నెలలో కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఏప్రిల్ 2న పంచాయతీలకు పదవీ కాలం ముగిసిపోతోంది. ఇక జూన్ నాటికి మండల జిల్లా పరిషత్తులకు పదవీ కాలం ముగుస్తోంది. అంటే మరో మూడు నెలలలో మొత్తం లోకల్ బాడీస్ లో ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రభుత్వాలకు గడువు పూర్తి అయిపోతుంది అన్న మాట. దాంతో ఎన్నికలు తిరిగి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రత్యేక అధికారులను అంతటా నియమించారు. ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికల గురించి మాట్లాడుతూ గెలుపు మనదే అని స్పష్టం చేశారు.
అంతా సిద్ధం కావాలి :
మరో ఆరు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు మంత్రులకు సూచనాప్రాయంగా చెప్పారు. అందువల్ల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూ ఉన్నాం, స్థానిక ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు అని అంటున్నారు.
మరో మినీ యుద్ధం :
స్థానిక సంస్థలకు ఎన్నికలు అంటే మినీ యుద్ధం అని అంటున్నారు. 2024 తరువాత జరిగే అతి పెద్ద ఎన్నికలుగా వీటిని చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా ఉందని వైసీపీ అంటోంది. కానీ లోకల్ బాడీస్ లో వైసీపీ ఏ మేరకు విజయాలను నమోదు చేస్తుంది అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇక అధికార కూటమిలో మూడు పార్టీలూ స్థానిక ఎన్నికల మీద ఎంతో ఆశగా ఉన్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో ఆయా పార్టీల ఆశావహులు అంతా రెడీగా ఉన్నారు. దాంతో స్థానిక ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి మొత్తానికి మొత్తం ఫలితాలను తమ పరం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది అని అంటున్నారు.
