Begin typing your search above and press return to search.

అసెంబ్లీకా - పెద్ద‌ల స‌భ‌కా.. టీడీపీ యువ‌నేత‌కు బిగ్ టెస్ట్‌.. !

ఒకవైపు రాజ్యసభ సీటు వరిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు కూడా రేకెత్తుతున్నాయి.

By:  Garuda Media   |   19 May 2026 8:45 AM IST
అసెంబ్లీకా - పెద్ద‌ల స‌భ‌కా.. టీడీపీ యువ‌నేత‌కు బిగ్ టెస్ట్‌.. !
X

ఒకవైపు రాజ్యసభ సీటు వరిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో యువ నాయకుడు.. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్య న్నపాత్రుడు తనయుడు విజయ్ ఏ నిర్ణయం తీసుకోవాలని విషయంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు తెలుగుదేశంలో టాక్ బ‌లంగా వినిపిస్తోంది. గత కొన్నా ళ్లుగా ఆయనకు రాజ్యసభ స్థానం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే అనకాప‌ల్లి నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని అనుకున్నారు.. పొత్తులో కుద‌ర‌క‌పోవ‌డంతో న‌ర్సీప‌ట్నం నుంచి అసెంబ్లీకి అయినా పోటీ చేద్దాం అనుకున్నారు.

కానీ పోటీ తీవ్రత... రాజకీయ వాతావరణ నేపథ్యంలో అప్పట్లో సీఎం చంద్రబాబు చింతకాయల అయ్యన్నపాత్రుడు వైపే మొగ్గుచూపారు. దీంతో విజయ్‌కు అవకాశం రాలేదు. అయితే, పార్టీలో యాక్టివ్ గా ఉండడంతోపాటు యువ నాయకుడిగా ముఖ్యంగా లోకేష్ బృందంలో కూడా విజయ్ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ప్రస్తుతం కూడా అదే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.

వీటిలో మిత్ర పక్షాలకు చెరొకటి ఇచ్చినా.. రెండు స్థానాలను టిడిపి తన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. దీంతో ఒకటి అయ్యన్నపాత్రుడు తనయుడికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజ‌య్‌ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉంటారా.. లేకపోతే రాజ్యసభకు వెళ్తారా అనేదానిపై పార్టీలో గ‌ట్టిగా చ‌ర్చ మొద‌లైంది.

విజయ్‌ రాజ్యసభకు కాకుండా వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ చేసే వ్యూహం ఉందని పార్టీ సీనియర్ వర్గాలు చెబుతున్నాయి. యువ నాయకుడు, ఉత్సాహవంతుడు రాజ్యసభకు వెళ్లడం కన్నా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా మేలు జరుగుతుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై పార్టీ అధినేత కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తుతం టిడిపిలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది.

అయితే ఇంత జరుగుతున్నా అయ్యన్నపాత్రుడు మాత్రం మౌనంగా ఉన్నారు. ఏం జరిగితే అదే జరుగుతుంది అన్నట్టుగా ఆయన చూస్తూ మౌనంగా పాటిస్తున్నారు. మరి వాస్తవానికి విజయ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడమే మంచిది అన్న అభిప్రాయం స్థానికంగా వినిపిస్తుండడం గమనార్హం.