ఎన్టీఆర్ తో చంద్రబాబు మొదటి భేటీ అదే !
ఇదిలా ఉంటే తొలి భేటీలోనే ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అని చెబుతారు.
By: Satya P | 20 April 2026 10:45 AM ISTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఈ రోజు. ఈ రోజుతో ఆయన 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ ఏట అడుగు పెడుతున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి రెండు సార్లు విభజన ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. ఆయన నాల్గవసారి ముఖ్యమంత్రిత్వం ప్రస్తుతం సాగుతోంది. ఇదిలా ఉంటే రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు అనుభవం అర్ధ శతాబ్దం గా ఉంది. ఆయన 1974 నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ మీదట కాంగ్రెస్ తరఫున తన సొంత నియోజకవర్గం చంద్రగిరి బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఫస్ట్ టెర్మ్ లోనే అన్నీ :
ఇదిలా ఉంటే చంద్రబాబు 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. గిర్రున రెండేళ్ళు తిరిగేసరికి ఆయన 1980లో అంజయ్య కేబినెట్ లో మంత్రి అయ్యారు. అంటే మూడు పదుల వయసులో అన్న మాట. ఆయనకు ఇచ్చిన శాఖలు చూస్తే సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య వంటివి. అయితే సినిమా పరిశ్రమ అపుడు మద్రాస్ లో ఉండేది. దాంతో ప్రధాన శాఖ తరఫున ఆయన పనిచేసే అవకాశం అయితే పెద్దగా లేదని చెప్పాలి. కానీ చంద్రబాబు పనిమంతుడు కాబట్టి తనకు ఇచ్చిన శాఖలోనే వీలైనంత పని పెట్టుకుని మరీ ఆ శాఖకు కూడా ఒక రూపం తెచ్చారు. ఎగ్జిబిటర్లు అంతా ఉమ్మడి ఏపీలో ఉండేవారు. వారి సమస్యలను పరిష్కరించడం, హైదరాబాద్ కి పరిశ్రమను తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ఇలా బాబు తనకు ఇచ్చిన శాఖకు న్యాయం చేశారనే చెప్పాలి.
ఎన్టీఆర్ అభిమానిగా :
చంద్రబాబు తానుగా ఎన్నో సార్లు చెప్పినట్లుగా ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఆయన సినిమాలు చూసి పెరిగారు. ఇక ఆయనకు మంత్రిగా వచ్చిన శాఖ కూడా సినీ పరిశ్రమకు చెందినదే. దాంతో ఆయనలో ఒక కోరిక అయితే బలంగా ఉండేది. తాను ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ని చూడాలని. తన అభిమాన హీరోతో కలిసి మాట్లాడాలని. ఆ విషయం ఆయన అప్పటికి ఎగ్జిబిటర్ గా ఉనన్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ చెవిన వేశారు. బాబు వద్దకు ఎగ్జిబిటర్ గా ఉన్న జయక్రిష్ణ తరచూ వస్తూండేవారు. అలా జయ కృష్ణ ద్వారా ఎన్టీఆర్ ని బాబు కలిసింది తొలిసారి హైదరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియోస్ లో. ఆ సమయంలో ఎన్టీఆర్ అనురాగ దేవత సినిమా షూటింగ్ చేస్తున్నారు. అది ఎన్టీఆర్ సొంత సినిమా. దాంతో తన సొంత స్టూడియోలోనే సినిమా నిర్మాణం చేపట్టారు.
తొలి భేటీలోనే అలా :
ఇదిలా ఉంటే తొలి భేటీలోనే ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అని చెబుతారు. చంద్రబాబులోని క్రమశిక్షణ పట్టుదల పనిమంతుడిగా ఆయన చూపించే నేర్పు ఇవన్నీ ఎన్టీఆర్ కి బాగా నచ్చేశాయి అని అంటారు. అందుకే చకచకా తరువాత పరిణామాలు జరిగిపోయాయి. ఎన్టీఆర్ తన మూడవ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి పెళ్ళి చేశారు. అలా బాబు వివాహం మంత్రిగా ఉండగానే 1981 సెప్టెంబర్ 10న మద్రాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత మరో ఏడాదికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ ఆ పార్టీ తరఫునే 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిన చంద్రబాబు అనంతర కాలంలో టీడీపీలో చేరారు. సినీ గ్లామర్ తో ఏర్పడిన టీడీపీకి పొలిటికల్ గ్రామర్ అద్దారు. పార్టీని క్యాడర్ బేస్డ్ పార్టీగా రూపొందించడంలో బాబు పాత్ర అత్యంత కీలకమైనదిగా ఉంది.
భుజాల మీద టీడీపీ :
టీడీపీని 1982లో ఎన్టీఆర్ స్థాపిస్తే 1996 నాటికి ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. అంటే ఎన్టీఆర్ రాజకీయం కేవలం 14 ఏళ్ళు మాత్రమే సాగింది అన్న మాట. ఇక టీడీపీని మొదటి నుంచి చంద్రబాబు తన భుజాల మీద మోస్తూ ఈ రోజు ఈ స్థితికి తీసుకుని వచ్చారు. సంక్షోభాలను సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడం ఒడిదుడుకులను నిలిచి తట్టుకోవడం బాబులో ఉత్తమ నాయకత్వ లక్షణాలు. అంతే కాదు ముందు చూపుతో వ్యవహరించడం ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు వేసి మరీ వారిని రాజకీయ మైదానంలో మట్టి కరిపించడం ద్వారా బాబు రాజకీయంగా అపర చాణక్యుడిగా పేరు గడించారు. ఆయన కసి ప్లస్ కృషికి టీడీపీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందని చెప్పాలి. బాబు ఈ రోజున దేశంలో అత్యంత సీనియర్ నాయకుడుగా ఉన్నారు. చురుకైన నేతగా రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
