అవినాష్‌కు చెక్: భూపేష్‌కు చక్కటి ఛాన్స్.. !
టిడిపిలో పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జిల నియామకానికి సంబంధించి కీలక కసరత్తు జరుగుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రానుంది.
By: Garuda Media | 20 Dec 2025 9:00 PM ISTటిడిపిలో పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జిల నియామకానికి సంబంధించి కీలక కసరత్తు జరుగుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రానుంది. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆసక్తికర అంశం చర్చనీయాంశంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన భూపేష్ రెడ్డికి కడప పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జి పోస్టు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తుది జాబితా లో కూడా ఆయన పేరు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కడపలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు.
బలమైన గళం తో పాటు.. స్థానికంగా కూడా మంచి ఇమేజ్ ఉన్న భూపేష్ రెడ్డికి కడప బాధ్యతలు అప్పగించడం మేలైన చర్యగా టిడిపి నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని మరోవైపు చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన భూపేష్ రెడ్డి వైసీపీ నేత అవినాష్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. 2019లో మూడున్నర లక్షలకు పైగా మెజారిటీ దక్కించుకున్న అవినాష్ రెడ్డికి గత ఎన్నికల్లో భూపేష్ రెడ్డి పోటీ కారణంగా 62,000 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది.
ఇది ఒక రకంగా వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన పరిణామం. అవినాష్ రెడ్డి గెలిచినప్పటికీ మెజారిటీ మాత్రం భారీ స్థాయిలో తగ్గిపోయింది. దీనికి కారణం భూపేష్ రెడ్డి బలమైన పోటీ ఇచ్చారన్న వాదన వినిపించడమే. ఇక వచ్చే ఎన్నికల నాటికి జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భూపేష్ రెడ్డి భావిస్తున్నారు. కానీ, పార్టీ అధినాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా కడప నుంచే ఆయనను దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ పార్లమెంటరీ స్థానానికి భూపేష్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తద్వారా అవినాష్ రెడ్డికి చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. బలమైన సామాజిక వర్గం, అదే విధంగా యువనాయకత్వాన్ని కలగలుపుకుని భూపేష్ రెడ్డి ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించే స్థాయికి ఆయన పుంజుకుంటారన్నది టిడిపి వేస్తున్న అంచనా. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపిక వ్యవహారం జిల్లా స్థాయిలో జోరుగా సాగుతోంది. భూపేష్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ముఖ్యంగా పార్లమెంటు స్థాయిలో అవినాష్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని కూడా నాయకులు భావిస్తున్నారు.
