బీసీ జెండాతో జూనియర్ అయ్యన్న రెడీ !
చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడి మాదిరిగా లోకేష్ కి విజయ్ ఉంటారు అని నర్సీపట్నం టీడీపీ తమ్ముళ్లు అంటూంటారు.
By: Satya P | 7 Sept 2026 9:34 AM ISTచంద్రబాబుకు అయ్యన్నపాత్రుడి మాదిరిగా లోకేష్ కి విజయ్ ఉంటారు అని నర్సీపట్నం టీడీపీ తమ్ముళ్లు అంటూంటారు. అది నిజం అన్నట్లుగా లోకేష్ కి ఎంతో విశ్వాసపాత్రుడిగా విజయ్ చాలా ఏళ్ళుగా మెలుగుతూ వస్తున్నారు. ఐటీడీపీలో ఆయనే కీలకంగా ఉంటున్నారు. లోకేష్ టీం లో ఆయనే ముందు వరసలో ఉంటారు. ఇక చూస్తే లేటెస్ట్ గా రాజ్యసభ పదవి కూడా విజయ్ కి దక్కింది అంటే దానికి చంద్రబాబు లోకేష్ ఆయన మీద పెట్టిన బాధ్యత అని కూడా చెబుతారు. దానికి తగినట్లుగానే పార్లమెంట్ లో తొలి రోజు నుంచే విజయ్ టీడీపీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో కూడా ఆయన దిగి భవిష్యత్తు టీడీపీ కోసం యాక్షన్ ప్లాన్ ని రూపొందించారు.
జయహో బీసీ అంటూ :
ఎంపీ విజయ్ ఇపుడు తన సొంత ఇలాకా నర్శీపట్నంలో జయహో బీసీ అంటూ భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి సభను నిర్వహించే సన్నాహాలలో ఉన్నారు. ఈ సభకు ఏపీ నలుమూలల నుంచి బీసీలు పెద్ద ఎత్తున వస్తారని అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేతలు అంతా హాజరవుతారని అంటున్నారు. నిజానికి చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలు బీసీలు నూటికి ఎనభై శాతం ఉన్న ప్రాంతాలుగా పేర్కొంటారు. దాంతో ఉత్తరాంధ్రా గడ్డ మీదనే బీసీ సభను నిర్వహించి జయప్రదం చేయాలని విజయ్ తలపెట్టారు. ఈ నెల 9న ఆయన నర్శీపట్నం వేదికగా భారీ సభను నిర్వహించి టీడీపీకి ప్రతిష్టను తెస్తూ ఏపీ రాజకీయాల్లోనే సంచలనం రేకెత్తించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
బ్రాండ్ ని పెంచుతూ :
బీసీల పార్టీగా టీడీపీకి ఎంతో గుర్తింపు ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా ఈ సభను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఎంపీ విజయ్ చెబుతున్నారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకుని వస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారని దానిని కూటమి నిలబెట్టుకుందని అయన గుర్తు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియ చేయవలసిన బాధ్యత ఉందని అందుకే జయహో బీసీ సభ అని ఆయన అంటున్నారు.
ఐక్యతను చాటేందుకే :
ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా బీసీలంతా తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరుతున్నారు. ఈ సభ గతంలో ఎన్నడూ జరగని విధంగా ఘనంగా నిర్వహించాలని కూడా ఎంపీ విజయ్ భావిస్తున్నారు. జయహో బీసీ సభ ద్వారా జూనియర్ అయ్యన్న తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారని అంటున్నారు. తనకు ఎంపీ పదవి ఇచ్చి పార్టీలో కీలక స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీకి జీవగర్ర గా ఉన్న బీసీలందరినీ ఒకే చోటుకు చేర్చడం ద్వారా పార్టీకి మరింత పరిపుష్టి తీసుకుని రావాలని ఆయన చూస్తున్నారు. అంతే కాదు బీసీలలో సరికొత్త యువ నాయకుడిగా కూడా ఈ సభ ద్వారా ఆయన అవిష్కరించబడతారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో జయహో బీసీ సభ ఏ విధమైన స్పందనను కలిగిస్తుందో చూడాల్సి ఉంది.
