Begin typing your search above and press return to search.

డిప్యూటీ చైర్మన్...హుందాగా టీడీపీ

ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని అంటున్నారు. తమ ఎమ్మెల్సీలలో పలువురు ఈ పదవిని ఆశిస్తున్నా కూడా సమర్ధుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన మాధవరావుని ఎంపిక చేసింది.

By:  Satya P   |   20 Aug 2026 5:00 AM IST
డిప్యూటీ చైర్మన్...హుందాగా  టీడీపీ
X

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కీలకమైనదిగానే చూడాలి. ఎందుకంటే ఇది పెద్దల సభ. అంతే కాదు చైర్మన్ డిప్యూటీ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే చైర్మన్‌తో సమానంగా డిప్యూటీ చైర్మన్‌కు తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాష్ట్రంలోని మేధావులు, వివిధ రంగాల నిపుణులు సభ్యులుగా ఉండే ఈ సభలో సంయమనం, హుందాతనం కాపాడడంలో డిప్యూటీ చైర్మన్ బాధ్యత ఎంతో ఉంటుంది. ఇంతటి కీలకమైన పదవి కష్టకాలంలో వైసీపీ పరం అయింది. నిజానికి సంఖ్యా బలం రిత్యా వైసీపీదే మండలిలో పైచేయి. మొత్తం 58 మంది సభ్యులు కలిగిన సభలో 30 మందికి పైగా సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఆ విధంగా మెజారిటీ ఆ పార్టీకి ఉంది. దాంతో డిప్యూటీ చైర్మన్ ఆ పార్టీకే దక్కింది. సరిగ్గా ఇక్కడే టీడీపీ కూటమి హుందాతనం గురించి చెప్పుకోవాలని అంటున్నారు.

పోటీకి దిగకుండా :

టీడీపీ కూటమి తలచుకుంటే పోటీకి దిగవచ్చు. ఆ తరువాత ఎన్నిక జరిగితే రసకందాయంలో అంతా సాగుతుంది. అదే సమయంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలను కూడా తమ వైపు ఆకట్టుకుని ఎలాగైనా వ్యూహాలతో టీడీపీ తమ విజయాన్ని నమోదు చేయవచ్చు అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, పైగా శాసన సభ అంతా పరచుకున్న పార్టీ తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. కానీ ఇక్కడే కూటమి పెద్దన్న టీడీపీ హుందాతనాన్ని పాటించింది అని అంటున్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం అయింది అని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ వ్యూహాత్మకం :

ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని అంటున్నారు. తమ ఎమ్మెల్సీలలో పలువురు ఈ పదవిని ఆశిస్తున్నా కూడా సమర్ధుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన మాధవరావుని ఎంపిక చేసింది. తూమాటి మాధవరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వైసీపీలో ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు మండలిలో ఆయన పెద్ద గొంతుకగా ఉంటూ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతో ఆయన చిత్తశుద్ధికి అంకితభావానికి వైసీపీ పెద్ద పీట వేసింది అని అంటున్నారు.

మంచి సంప్రదాయం :

నిత్యం ఏపీ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ఢీ అంటే ఢీ కొడుతూ ఉంటాయి. అదే విధంగా రాజకీయ వేడి కూడా ఘాటుగానే ఉంటుంది. అలాంటి చోట ఇంత సామరస్యంగా హుందాగా ఒక కీలకమైన పదవికి ఎన్నిక ముగియడం అంటే మంచి సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు అని అనుకోవాల్సిందే. ఇదే తీరున ఆవేశ కావేశాలను తగ్గించి అధికార విపక్షాలు కలసికట్టుగా ఉంటే రాష్ట్ర సమస్యలకు తగిన విధంగా పరిష్కారం దక్కుతుందని అంటున్నారు. రాజకీయాలు హుందగా ఉంటేనే జనాలు కూడా ఆనందిస్తారు అని కూడా ప్రజాస్వమ్య ప్రియులు మేధావులు అంటున్నారు. ఇదిలా ఉంటే తనను అంతా కలసి ఏకగ్రీవంగా డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు తూమాటి మాధవరావు సభలోనే ధన్యవాదాలు చెప్పారు. ఇక ఆయన నాయకత్వంలో సభను చక్కగా నడుపుతారని అంతా ఆశిస్తున్నారు.