సీమ సూపర్ హిట్....వైసీపీ గ్రాఫ్ కి చెక్
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నదే రాజకీయంగా సాగుతోంది. 2014 నుంచి ఇదే జరుగుతోంది. ఆ వైపు ఈ వైపు మోహరింపు.
By: Satya P | 19 Oct 2025 12:00 AM ISTఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నదే రాజకీయంగా సాగుతోంది. 2014 నుంచి ఇదే జరుగుతోంది. ఆ వైపు ఈ వైపు మోహరింపు. పట్టు బిగింపు. ఒక ఎన్నికలో ఒకరు తెలిస్తే మరో ఎన్నికల్లో ఇంకొకరు. ఇపుడు అధికారం టీడీపీ కూటమి చేతిలోకి వచ్చింది. అయితే సెంటిమెంట్ చూసినా ట్రాక్ రికార్డు చూసినా 2029 ఆశలు వైసీపీకి ఉన్నాయి. దానికి మూల కేంద్రాల మీదనే ఇపుడు కూటమి భారీ స్కెచ్ గీసి మరీ దెబ్బ తీస్తోంది అని అంటున్నారు.
లక్షలాదిగా జనం :
కర్నూల్ లో తాజాగా జరిగిన కూటమి సభకు లక్షలాదిగా జనాలు తరలివచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ హైలెట్ అయ్యారు. ఇక ఈ సభకు లక్షలాది మంది జనాలు తరలిరావడం తరలి గొప్ప విషయంగానే చూస్తున్నారు. రాయలసీమలో ఇంతటి భారీ సభ సాగడం ఎటు చూసినా జన సందోహంతో నిండిపోవడం చూస్తే కూటమి ఎంత స్ట్రాంగ్ అన్నది సీమ జనాలకు ప్రత్యేకంగా చాటి చెప్పినట్లు అయింది.
వైసీపీ కోటలో :
ఇక చెప్పాలంటే కర్నూల్ ఒక్క 2024 ఎన్నికల్లో తప్ప 2014, 2019లలో వైసీపీకే పట్టం కట్టింది. అది కూడా అలా ఇలా కాదు, అత్యధిక సీట్లనే అందించింది. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తరువాత వైసీపీ వేగంగా పుంజుకున్న ప్రాంతాలు గా కడప కర్నూల్ అని చెబుతున్నారు. ఈ రెండు చోట్ల వైసీపీ గ్రాఫ్ పెరిగితే సులువుగా 24 సీట్లలో అత్యధిక స్థానాలు దక్కుతాయి. వైసీపీ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు అడుగులు వేస్తోంది. అదే విధంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. కానీ కూటమి కర్నూల్ లో భారీ సభను పెట్టడం ద్వారా వైసీపీ గ్రాఫ్ కి చెక్ చెప్పేందుకు ప్రయత్నించింది అని అంటున్నారు.
రాజకీయ భావజాలం :
ఇక సీమ ప్రాంతం చూస్తే ఒకనాడు కాంగ్రెస్ ఆ తరువాత వైసీపీతోనే ఎక్కువగా ప్రయాణించారు. టీడీపీకి ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో సీమలో ఆ పార్టీ ప్రభంజనం ఎక్కువగా కనిపించింది. మళ్ళీ 2024 ఎన్నికల్లోనే దశ తిరిగింది. టోటల్ గా సీమ జిల్లాలను టీడీపీ కూటమి ఊడ్చి పారేసింది అంటే చాలా కాలం తరువాత సీమ జనాలు తమ రాజకీయ భావజాలాన్ని దాటి వెలుపలకు చూడగలిగారు అని అంటున్నారు. అంతే కాదు తాము దశాబ్దాలుగా అభిమానించే కాంగ్రెస్ ఫిలాసఫీ కి వ్యతిరేకంగా తొలిసారి బయటపడి కూటమికి బిగ్ సపోర్టుగా నిలిచారు. దాంతోనే ఏ మాత్రం గుర్తింపు లేని చోట బీజేపీ కూడా సీట్లు గెలుచుకోగలిగింది. ఇక జనసేన అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ విజయానికి అయితే పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
ఫీల్ గుడ్ కోసమే :
సీమలో ఒక భావన అయితే ఉంది. తాము దశాబ్దాలుగా అభివృద్ధి చెందలేకపోతున్నామని, దానికి కారణం వారు ఒక పొలిటికల్ ఫిలాసఫీకి గట్టిగా కట్టుబడి పోవడమే అని అంటారు. అంతే కాకుండా తాము నెత్తికెక్కించుకున్న పార్టీలు కూడా పెద్దగా ఉద్ధరించలేదన్న స్పృహ కు వారు రావడమే 2024 ఎన్నికల్లో కనిపించింది. ఇలా అంది వచ్చిన అవకాశంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. దీనిని శాశ్వతం చేసుకునేందుకు కూటమి పెద్దలు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అంతే కాదు చేతిలో ఉన్న అధికారంతో రాయలసీమను రతనాల సీమగా చేస్తామని చెబుతున్నారు.
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే :
ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రకటిస్తున్నారు. సాక్షత్తూ దేశ ప్రధాని సీమ ముఖ ద్వారానికి వచ్చి వేలాదిగా డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం అంటే మామూలు విషయం కాదు, ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద ఫీల్ గుడ్ అన్నది ఏర్పడాలనే కర్నూల్ లో సభ పెట్టారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఇపుడిపుడే పుంజుకుంటున్న వైసీపీకి ఈ సభ ఒక చెక్ పాయింట్ గా మారింది అని అంటున్నారు. మరి వైసీపీ దీనిని అధిగమించేందుకు ఏ విధమైన పొలిటికల్ స్ట్రాటజీని ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. ఇక్కడ ఒక్క మాట ఉంది. సీమ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే నమ్మకం పెడితే దశాబ్దాల పాటు అదే సపొర్ట్ కొనసాగుతుంది. సో సీమలో ఇపుడు అంతా ఆసక్తికరంగానే ఉంది.
