పొత్తులతో చిత్తు అయింది టీడీపీ..రాజకీయ తమాషా మరి !
ఏపీలో టీడీపీ అతి పెద్ద పార్టీ. అంతే కాదు కోటికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ. టీడీపీ బూత్ లెవెల్ నుంచి పాతుకుపోయిన పార్టీ.
By: Satya P | 17 Oct 2026 8:00 PM ISTఏపీలో టీడీపీ అతి పెద్ద పార్టీ. అంతే కాదు కోటికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ. టీడీపీ బూత్ లెవెల్ నుంచి పాతుకుపోయిన పార్టీ. నాలుగున్నర దశాబ్దాలుగా టీడీపీ ఏపీలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 40 శాతం ఓటు షేర్ తగ్గని పార్టీ. దిగ్గజ నేతలు నిబద్ధత కలిగిన క్యాడర్, ఏ పార్టీకి లేని విధంగా అతి పెద్ద నెట్ వర్క్ టీడీపీ సొంతం. అలాంటి పార్టీ పొత్తు ధర్మం కోసం తన సీట్లను త్యాగం చేస్తూ మిత్రులతో కలసి పంచుకుంటోంది. నిజానికి చూస్తే పొత్తులలో టీడీపీకి హార్డ్ కోర్ సీట్లు ఎన్నో మిత్రులకు వెళ్లాయి. అలాగే డెడ్ ఈజీగా గెలిచే సీట్లు మిత్రులకు కేటాయించి తాను రిస్క్ చేస్తూ గట్టి పోటీ సీట్లను ఎంచుకుంది. ఇంత చేసినా సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ పొత్తులలో ఏదో అన్యాయం చేసినట్లుగా జనసేన సామాజిక కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చేస్తున్న ట్వీట్లు పెడుతున్న పోస్టులు ఇవన్నీ చూస్తున్న తమ్ముళ్ళు అయితే అసలేమి అన్యాయం జరిగిందిరా భాయ్ అని విస్తుబోతున్నారు. పొత్తులో మంచి సీట్లే ఇచ్చాం కదా అని కూడా స్పష్టంగా చెబుతున్నారు.
సైనికుల ఆవేదన :
నిజానికి స్థానిక సంస్థల పొత్తులలో నష్టపోయింది టీడీపీ అని అంటున్నారు. ఉదాహరణకు చూస్తే రాజకీయ రాధధాని గుండె కాయ లాంటి విజయవాడ మేయర్ సీటు టీడీపీ తీసుకోలేద్జు, అలాగే కాకినాడ మేయర్ సీటు టీడీపీ ఉంచుకోలేదు, ఇక రాజమండ్రి మేయర్ సీటు, శ్రీకాకుళం మేయర్ సీటు, అనంతపురం మేయర్ సీటు, ఏలూరు మేయర్ సీటు టీడీపీకి కాదు కదా అని అంటున్నారు. ఇవన్నీ ఎంతో కీలకమైన సీట్లు పైగా కోస్తా అంతటా పరచుకున్న సీట్లతో పాటు అనంతపురం సీటు అయితే సీమకు కీలక స్థావరంగా ఉంది. ఇవన్నీ పొత్తులలో మిత్రులకు టీడీపీ వదులుకుంది అని గుర్తు చేస్తున్నారు.
భారీగా సీట్ల షేర్ :
ఇక స్థానిక ఎన్నికల్లో ఏకంగా 35 శాతం సీట్ల షేర్ ని జనసేన బీజేపీ కలసి సాధించారు అని కూడా విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. పైగా కూటమి అధికారంలో ఉంది, అలా చూస్తే కళ్లు మూసుకుని పోటీ చేసినా గెలవగలిగే పరిస్థితిలో ఉన్న టీడీపీ నుంచి కీలకమైన సీట్లను జనసేన- బీజేపీకి పంచి ఇచ్చి గట్టి పోటీలకు సై అని టీడీపీ నిలబడింది అన్నది కూడా కీలక విశ్లేషణగానే చూడాల్సి ఉంది. ఇలా చూస్తే ఎంతో ముఖ్యమైన సీట్లు అన్నీ మిత్రులకు ఇచ్చిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యత కోసం మిత్ర ధర్మం కోసం ఒక స్పూర్తిగా నిలిచిన సంగతిని కూడా గమనిస్తున్న వారు అధిక శాతం ఉన్నారు. వారంతా సామాజిక మాధ్యమాలలో ఈ సీట్ షేర్ ని చూసి టీడీపీ పెద్దన్నగా సమ న్యాయమే చేసింది అని అంటున్నారు.
ప్రధాన నగరాలు అన్నీ :
ఈ సీట్ల ఒప్పందంలో మరో ముచ్చట కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే కనుక రాష్ట్రంలోని ప్రధాన నగరాల మేయర్ సీట్లన్నీ దాదాపుగా జనసేన బీజేపీ పొత్తు ఖాతాల్లోకే వెళ్లాయని అంటున్నరు. ఎంతో బలంగా ఉండి దశాబ్దాలుగా అనేక ఎన్నికల్లో అధికారాన్ని టాప్ టూ బాటమ్ అందుకున్న టీడీపీ నుంచి ఈ విధంగా పొత్తులలో ప్రధానమైన కీలకమైన సీట్లు మిత్ర పక్షాలు సాధించడం అన్నది రాష్ట్ర చరిత్రలోనే ఎపుడూ లేదు, ఎన్నో పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది కానీ ఈ విధంగా టీడీపీ ముందుకొచ్చి కీలక స్థావరాలను మిత్రులకు పంచిన సందర్భం అయితే లేదని గుర్తు చేస్తున్నారు.
మరి ఇంతలా టీడీపీ తగ్గినా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కూడా బాగానే పొత్తులలో తమ పార్టీకి సీట్లు దక్కేలా చూశారు. అయినా ఆయన మీద కూడా జనసేన పేరుతో కొందరు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి విమర్శలు చేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఇదంతా చూస్తూంటే వింత వ్యవహారంగానే ఉంది అని అంటున్నారు. వాస్తవాలు అన్నీ గమనిస్తే టీడీపీ ఉదారంగా పొత్తులకు తగ్గి చాలానే త్యాగాలు చేసింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అని అంటున్నారు. మరి ఈ విశ్లేషణలు మననం చేసుకుంటే చాలు అసలు విషయాలు అందరికీ అర్ధం అవుతాయని అంటున్నారు.
