తెలంగాణలో టీడీపీ ఏకగ్రీవాలు.. సరిహద్దు జిల్లాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 9 పంచాయతీలను పసుపు సైనికులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు షాకిచ్చినట్లైంది.
By: Tupaki Political Desk | 3 Dec 2025 4:00 AM ISTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 9 పంచాయతీలను పసుపు సైనికులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు షాకిచ్చినట్లైంది. తెలంగాణలో టీడీపీ ఉనికే లేదని ఇన్నాళ్లు చెప్పిన ప్రధాన పార్టీలు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైకిల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి నానా పాట్లు పడ్డారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ పదవులను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ పునాదులు చెక్కుచెదరేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలతోపాటు హైదరబాద్ నగరం చుట్టుపక్కల విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా రాజకీయం చేసేది. అయితే 2004లో ఓటమి తర్వాత తెలంగాణలో తెలుగుదేశం తిరిగి బలపడే పరిస్థితి లేకుండా పోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలిస్తే.. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోవడం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో టీడీపీ ప్రధాన రాజకీయ శక్తి కొన్నాళ్లు రాజకీయాలు చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంతో తెలంగాణలో టీడీపీ తునాతునకలైంది.
ఒకానొకదశలో తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి తాళం వేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోవడంతో తెలంగాణ చట్టసభల్లో టీడీపీకి స్థానం లేకుండా పోయింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ.. గత పదేళ్ల కాలంలో దినదిన గండంగానే గడిపింది. అయితే 2023 ఎన్నికల తర్వాత టీడీపీ వ్యూహం మార్చింది. సొంతంగా పోటీ చేసి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుచుకోలేని స్థితిని అంగీకరించిన టీడీపీ.. తటస్థ పంథాను ఎంచుకుని తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయినట్లు సంకేతాలిచ్చింది. అయితే అధినాయకత్వం ఇలా సైలెంటు అయినా క్షేత్రస్థాయిలో టీడీపీతోనే ఉన్న కేడర్ మాత్రం తమ రాజకీయ ఆకాంక్షలను వదులుకోలే.. అలాగని పసుపు జెండాను కింద పడేయలేక అవకాశం చిక్కినప్పుడల్లా తమ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన టీడీపీ.. కాంగ్రెస్ కు తెరచాటు సహకరించిందని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ముఖ్యమంత్రి ఇంటి వద్ద, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవనులో కాంగ్రెస్ తో సమానంగా టీడీపీ కార్యకర్తలు హాడావిడి చేశారు. దీనిద్వారా రేవంత్ రెడ్డి విజయాన్ని తమ విజయంగా చాటుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత రాజకీయంగా రేవంత్ రెడ్డికి మరింత దగ్గరవుతున్న టీడీపీ.. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. టీటీడీపీ తన మాటపైనే ఉంటుందని బాహటంగా చెప్పుకురావడం గమనార్హం. అయితే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ పోరులో టీడీపీ నాయకులు తామే సొంతంగా బరిలో దిగుతూ పసుపు జెండా ఎగరేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో పలు పంచాయతీలను టీడీపీ ఏకగ్రీవం గెలుచుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీల్లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అన్నట్లు టీడీపీ పోటీ ఇస్తోందని అంటున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి నల్గొండ, వరంగల్, పాలమూరు జిల్లాల్లోనూ కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా ఏపీ సరిహద్దున ఉన్న జిల్లాల్లో టీడీపీ హవా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా అడుగులు వేసినా, టీడీపీ కేడర్ చెక్కుచెదరలేదని తాజా పరిణామాలతో రుజువైందని అంటున్నారు.
