Begin typing your search above and press return to search.

ఐటీ కొలువుల కల్లోలం.. టీసీఎస్ లో ఆగని లేఆఫ్స్.. భారత ఐటీ రంగం సంక్షోభంలోకేనా?

భారత ఐటీ రంగం ఈ స్థాయి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఏఐ విప్లవం వల్ల గతంలో వందలాది మంది చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   14 Jan 2026 8:00 AM IST
ఐటీ కొలువుల కల్లోలం.. టీసీఎస్ లో ఆగని లేఆఫ్స్.. భారత ఐటీ రంగం సంక్షోభంలోకేనా?
X

ఒకప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కలల సౌధం.. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా.. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ రంగం ఇప్పుడు అనిశ్చితి నీడలో చిక్కుకుంది. ముఖ్యంగా ఉద్యోగుల పట్ల అత్యంత సానుకూల దృక్పథంతో ఉండే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లోనే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధిస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిశ్శబ్దంగా సాగుతున్న ‘నిష్క్రమణ’ పర్వం

సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు సహజమే అయినా, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలో గత ఆరు నెలల్లోనే 30,000 మందికి పైగా ఉద్యోగులు తగ్గడం గమనార్హం. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం ఒక్క త్రైమాసికంలోనే 11,151 మంది ఉద్యోగులు తగ్గారు. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో నమోదైన తగ్గుదల కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కూడా ఈ కోతలు కొనసాగుతాయని సంస్థ సంకేతాలివ్వడం ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తోంది.

సంక్షోభానికి ప్రధాన కారణాలు ఏమిటి?

భారత ఐటీ రంగం ఈ స్థాయి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఏఐ విప్లవం వల్ల గతంలో వందలాది మంది చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ ‘రీస్ట్రక్చరింగ్‌’లో భాగంగా మానవ వనరుల అవసరాన్ని తగ్గించుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్‌లను భారీగా తగ్గించుకున్నారు. కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, ఉన్న ప్రాజెక్టులు నిలిచిపోవడంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాయి. పాత తరం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలకు కాలం చెల్లిపోతోంది. కొత్త టెక్నాలజీలకు అలవాటు పడని సీనియర్ ప్రొఫెషనల్స్‌పై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

‘సేఫ్ హేవన్’ ముద్ర పోతోందా?

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం తర్వాత అంతటి భద్రత ఉంటుందని నమ్మే సంస్థ టీసీఎస్. రిసెషన్ సమయంలో కూడా తన ఉద్యోగులను కాపాడుకున్న చరిత్ర ఈ సంస్థది. కానీ ఇప్పుడు అక్కడ కూడా లేఆఫ్స్ జరుగుతుండటంతో ఇక ఐటీ రంగంలో ‘జాబ్ సెక్యూరిటీ’ అనేది ఒక మిథ్యగా మారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీసీఎస్ వంటి స్థిరమైన సంస్థలే ఈ బాట పడితే, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది అని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్తు సవాళ్లు.. ఫ్రెషర్ల పరిస్థితి ఏంటి?

కేవలం అనుభవజ్ఞులే కాదు.. లక్షలాది మంది ఫ్రెషర్లు కూడా ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ తగ్గడం.. ఎంపికైన వారికి జాయినింగ్ లెటర్లు ఆలస్యం కావడం వంటివి ఐటీ రంగ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

భారత ఐటీ రంగం ప్రస్తుతం ఒక ‘పరివర్తన దశ’లో ఉంది. ఇది కేవలం తాత్కాలిక మందగమనమా లేదా దీర్ఘకాలిక సంక్షోభమా అనేది వేచి చూడాలి. అయితే ఉద్యోగులు కేవలం కోడింగ్ నైపుణ్యాలకే పరిమితం కాకుండా, ఏఐ, కొత్త టెక్నాలజీల్లో తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక రక్షణ కవచం.