Begin typing your search above and press return to search.

ఆఫీసు బయట పడుకుని నిరసన తెలిపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. టీసీఎస్ స్పందన ఇదీ

ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ ఉద్యోగులతో టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By:  A.N.Kumar   |   5 Aug 2025 11:31 AM IST
ఆఫీసు బయట పడుకుని నిరసన తెలిపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. టీసీఎస్ స్పందన ఇదీ
X

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) పుణే కార్యాలయం ఎదుట ఓ ఉద్యోగి ఫుట్‌పాత్‌పై నిద్రించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ ఉద్యోగులతో టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

-జీతం రాక నిరసనగా రోడ్డుపై..

సౌరభ్ మోరె అనే ఉద్యోగి తనకు జీతం అందకపోవడంతో నిరసనగా టీసీఎస్ పుణే ఆఫీసు ఎదుట రోడ్డుపై నిద్రించాడు. “నా దగ్గర డబ్బులేదు. టీసీఎస్‌ బయట పడుకోవాల్సి వస్తుందని హెచ్‌ఆర్‌కి ముందే చెప్పాను. జూలై 29, 2025న సహ్యాద్రి ఐటీ క్యాంపస్‌కి రిపోర్ట్‌ చేశాను. కానీ నా ఐడీ యాక్టివ్ కాలేదు. జీతం నిలిపివేశారు. హెచ్‌ఆర్‌ ఆఫీసర్లను కలిస్తే జీతం చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు” అంటూ ఓ కాగితంపై రాసి తన పక్కన ఉంచాడు. దీంతో ఆ దృశ్యాలు ఫోటోలుగా సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి.

-టీసీఎస్ స్పందన..

ఈ వ్యవహారం వైరల్ కావడంతో టీసీఎస్ కూడా స్పందించింది. సంబంధిత ఉద్యోగి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజరుకాకపోవడంతో, కంపెనీ నిబంధనల ప్రకారం అతని పేరోల్ నిలిపివేసినట్లు టీసీఎస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సదరు ఉద్యోగి తిరిగి ఆఫీసుకు రిపోర్ట్ చేశాడనీ, అతను విధుల్లోకి తిరిగొచ్చేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోందనీ, తాత్కాలికంగా అతడికి వసతి కల్పిస్తున్నామనీ తెలిపారు. అదే సమయంలో ఆయన ప్రస్తుతం సంస్థ ఆవరణలోనే ఉన్నాడని స్పష్టం చేశారు.

-వరుసగా వార్తల్లోకి టీసీఎస్

ఇటీవలి కాలంలో టీసీఎస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. సంస్థ సీఈఓ కృతివాసన్‌ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 12,000 మందికి పైగా ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధ సాంకేతికత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెబుతోంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

జాయినింగ్ డేట్లు లేక నిరీక్షణలో ఉద్యోగులు

ఇక గత కొన్ని నెలలుగా టీసీఎస్ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, అనుభవజ్ఞులకు జాయినింగ్ డేట్లు ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మండవీయాకి కూడా ఫిర్యాదులు చేరినట్లు తెలుస్తోంది. సంస్థ నుంచి ఆఫర్ లెటర్‌ అందుకున్న 600 మంది అనుభవజ్ఞుల్ని తప్పకుండా నియమిస్తామని టీసీఎస్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

-నిబంధనలు కంటే మానవీయత ముఖ్యం

ఒక ఉద్యోగి ఇలా రోడ్డుపై పడుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం ఎంతో బాధకరం. కంపెనీ నిబంధనలు ఒకవైపు ఉన్నా.. ఉద్యోగుల బాధలు, పరిస్థితులు మరోవైపు ఉన్నప్పుడు మానవీయతతో వ్యవహరించాల్సిన అవసరం పెరిగింది. టీసీఎస్‌ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి ప్రజలు మెరుగైన వృత్తిపరమైన నైతికతను ఆశించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.