Begin typing your search above and press return to search.

విశాఖ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్.. ఐటీ హిల్స్ లో ఆఫీసు రెడీ!

విశాఖ రుషికొండలోని ఐటీ హిల్స్ లో టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు తమ కార్యాలయాలను తాత్కాలికంగా ప్రారంభించబోతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Gallery Desk   |   21 Nov 2025 3:08 PM IST
విశాఖ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్.. ఐటీ హిల్స్ లో ఆఫీసు రెడీ!
X

ఏపీలో ఐటీ కంపెనీల ప్రారంభానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచిచూడకుండా.. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాయి. దీంతో విశాఖ నగరంలో రెండు దిగ్గజ ఐటీ పరిశ్రమలు త్వరలో తెరుచుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ చాలా రోజుల నుంచే ఈ పనిలో ఉండగా, తాజాగా కాగ్నిజెంట్ కూడా జనవరి నుంచి విశాఖలో ఆపరేషన్స్ కొనసాగించునున్నట్లు తాజాగా ప్రకటించింది.

విశాఖ రుషికొండలోని ఐటీ హిల్స్ లో టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు తమ కార్యాలయాలను తాత్కాలికంగా ప్రారంభించబోతున్నాయని అంటున్నారు. రుషికొండపై మిలీనియం టవర్స్ లో టీసీఎస్ కు ఇప్పటికే భవనం కేటాయించగా, కాగ్నిజెంట్ కూడా ఐటీ హిల్స్ లో నంబర్ 1, 2 భవనాలను అద్దెకు తీసుకోడానికి వీఎంఆర్డీఏను సంప్రదించినట్లు సమాచారం. ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అనేక భవనాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో తమకు అనువైన భవనాలను ఎంపిక చేసేందుకు కాగ్నిజెంట్ ప్రత్యేక బృందాన్ని పంపిందని చెబుతున్నారు.

టీసీఎస్ కార్యాలయం ఇప్పటికే సిద్ధమవగా, ప్రారంభానికి కొద్దిరోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఇక జనవరి నుంచి 800 మందితో విశాఖలో ఆపరేషన్స్ కి కాగ్నిజెంట్ రెడీ అయింది. విశాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే తమ ఎంప్లాయిస్ అందరికీ సమాచారం ఇచ్చింది. శుక్రవారంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసిందని అంటున్నారు. ఉద్యోగులు ఆసక్తిని బట్టి కార్యాలయ భవనాలను సిద్ధం చేయాలని కాగ్నిజెంట్ యాజమాన్యం ఆలోచిస్తోందని అంటున్నారు.

విశాఖలో రూ.1,583 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 8 వేల మందికి ఉపాధి చూపుతామని తమకు అవసరమైన వసతులు కల్పించాలని ప్రభుత్వానికి ఇదివరకే ప్రతిపాదించింది. రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు పరోక్షంగా మరికొన్ని వేల కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందుతుందనే కోణంలో ప్రభుత్వం కాగ్నిజెంట్ కు భూములు కేటాయించింది. కాపులుప్పాడ ప్రాంతంలో 21.33 ఎకరాలను అప్పగించింది. ఆ భూముల్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మిస్తున్నారు. అయితే ఈలోగా విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో జనవరి నుంచి ఆపరేషన్స్ నిర్వహణకు సమాయుత్తమైందని అంటున్నారు.