టాటా నానో ఈవీ రీఎంట్రీ.. కొత్త అవతారంలో ‘సామాన్యుడి కారు’ రాబోతుందా?
నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా సరికొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్... లేటెస్ట్ క్రాష్ టెస్ట్ ప్రమాణాలు.. ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం.
By: A.N.Kumar | 11 Aug 2026 1:22 PM ISTఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన ‘సామాన్యుడి కారు’ టాటా నానో మరోసారి వార్తల్లోకి వచ్చింది. భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు నాలుగు చక్రాల వాహన కలను నిజం చేయాలనే దివంగత రతన్ టాటా ఆశయంతో రూపుదిద్దుకున్న ఈ చిన్న కారు.. కొన్ని కారణాల వల్ల మార్కెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నానో రీఎంట్రీపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
రతన్ టాటా కలల ప్రాజెక్ట్
2008లో ఆవిష్కరించి 2009లో మార్కెట్లోకి తీసుకొచ్చిన టాటా నానో.. కేవలం రూ.లక్ష ప్రారంభ ధరతో 'ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు'గా నిలిచింది. వర్షంలోనూ, ఎండలోనూ బైక్‌లపై ప్రమాదకరంగా ప్రయాణించే చిన్న కుటుంబాలకు రక్షణగా నిలవాలన్నదే రతన్ టాటా ఆలోచన. అయితే మార్కెటింగ్ వ్యూహాల్లో "చీపెస్ట్ కార్" అనే ముద్ర పడటం.. భద్రతపై విమర్శలు రావడం నానో విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భారతదేశంలో కారు అనేది కేవలం రవాణా సాధనం మాత్రమే కాకుండా హోదాకు సంకేతంగా భావించడం వల్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోయి ఉత్పత్తి నిలిచిపోయింది.
ఎలక్ట్రిక్ అవతారంలో నానో రీఎంట్రీ?
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం వేగంగా ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. టాటా మోటార్స్ ఇప్పటికే నెక్సన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీలతో ఈవీ సెగ్మెంట్‌లో రాణిస్తోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు చిన్న సైజు, తక్కువ ఖర్చుతో కూడిన ఈవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో నానో బ్రాండ్‌ను స్మార్ట్ అర్బన్ ఈవీగా తిరిగితెచ్చే అవకాశాలపై టాటా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టాటా మోటార్స్ డిజైన్ హెడ్ అజయ్ జైన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహగానాలకు మరింత బలం చేకూర్చాయి.
ఆశించదగిన కొత్త ఫీచర్లు
కొత్త తరహా నానో మార్కెట్లోకి వస్తే అది పాత మోడల్ లాగా కాకుండా పూర్తిగా ఆధునిక రూపంలో ఉండే అవకాశం ఉంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా సరికొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్... లేటెస్ట్ క్రాష్ టెస్ట్ ప్రమాణాలు.. ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం. రోజువారీ సిటీ వినియోగానికి సరిపడే రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్... డిజిటల్ డిస్ప్లే, డిజిటల్ క్లస్టర్, ఇతర స్మార్ట్ ఫీచర్లు ఉండనున్నాయి.
'చవకైన కారు' ముద్రను అధిగమించాలి
ఈసారి టాటా మోటార్స్ గత అనుభవాల నుంచి నేర్చుకుని.. దీనిని "చవకైన కారు"గా కాకుండా "స్మార్ట్ అండ్ ఎకనామికల్ సిటీ ఈవీ"గా ప్రోత్సహించాల్సి ఉంటుంది. బ్యాటరీ ప్రాసెస్, టెక్నాలజీ వ్యయం కారణంగా ఇది రూ. లక్ష ధరలో రావడం సాధ్యం కాకపోయినప్పటికీ.. రీజనబుల్ ప్రైస్‌లో వస్తే మాత్రం మార్కెట్‌లో మరోసారి కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ రీఎంట్రీ నిజమవుతుందో లేదో తెలియాలంటే టాటా మోటార్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
