సభా పర్వం : ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్ట్ !
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడు అయినందునే ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.
By: Tupaki Political Desk | 8 Sept 2026 9:40 AM ISTతెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శాసనసభ సమావేశాల ప్రారంభం సంధర్భంగా నల్ల టీషర్టులతో సభలోకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న సంధర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు, పోలీసులు ప్రవర్తించిన తీరు చర్చానీయాంశంగా మారింది. అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి, స్పీకర్ ను ఉద్దేశించి తాతా మధు అసభ్యకర భాష వాడారని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూడా ఆదేశాలు ఇవ్వడానికి స్పీకర్ ఎవరని చైర్ ను అవమానించారని వారిద్దరి మీద కేసులు నమోదు చేశారు. ఈ ఉదయం వారిద్దరినీ అరెస్టు కూడా చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడు అయినందునే ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాతా మధును శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీర్మానిస్తూ శాసనమండలి చైర్మన్ కు సిఫారసు చేశారు. ఈ రోజు ఆయన సభ్యత్వం రద్దు మీద చర్య తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం జరిగింది.
సోమవారం శాసనసభ సమావేశాలకు నల్ల టీ షర్టులతో వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలీసులకు ప్రజాప్రతినిధులను అడ్డుకునే హక్కు లేదని, సభ లోపల, సభ బయట శాసనసభ నియమావళికి విరుద్దంగా ప్రవర్తించినట్లయితే నేరుగా స్పీకర్ చర్యలు తీసుకుంటారని, సభకు హాజరయ్యే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడవద్దని కోర్టు ఆదేశించింది.
స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న తాతా మధును ఆయన నివాసంలో, కోకాపేటలో ఉన్న నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నిన్న ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలు డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకులు ప్రకటించారు. దీంతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద 144 సెక్షన్ విధించామని, అటువైపు ఎవరూ రావద్దని పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎర్రవలలి, గజ్వేల్ నియోజకవర్గాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్నది వేచిచూడాలి.
