Begin typing your search above and press return to search.

ఆజాద్ కాశ్మీర్ అబద్దం !

‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అని పిలవడం అతి పెద్ద అబద్దం. పాకిస్తాన్ తీవ్రవాదులను పంపి జమ్ముకశ్మీర్ ను శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసింది.

By:  Tupaki Political Desk   |   24 Sept 2026 12:43 PM IST
ఆజాద్ కాశ్మీర్ అబద్దం !
X

‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అని పిలవడం అతి పెద్ద అబద్దం. పాకిస్తాన్ తీవ్రవాదులను పంపి జమ్ముకశ్మీర్ ను శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నిరాయుధ నిరసనకారులను చంపి పీఓకేను కూడా అలాగే మారుస్తోంది’ అని బారాముల్లాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త తస్లీమా అక్తర్ జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 63వ సమావేశం వేదికగా నినదించారు.

అసోసియేషన్ ఆఫ్ టెర్రర్ విక్టిమ్స్ ఇన్ కాశ్మీరి సంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న ఆమె పాక్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులపై మాట్లాడారు. శాంతియుత నిరసనకారులను క్రూరంగా అణచివేస్తుందని, పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని హింసాత్మకంగా మార్చిందని, వందల మంది ఉద్యమకారులు, మద్దతుదారులను అరెస్ట్ చేశారని తస్లీమా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని, కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఆంక్షలు విధించారని, అక్కడ పౌర స్వేచ్ఛ లేదని, నిరపరాధ పౌరులను పాకిస్తాన్ భద్రతా దళాలు చంపడం వెంటనే ఆపేయాలని, పౌర స్వేచ్ఛను, కమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

అజాద్ కాశ్మీర్ అనే వాదన అబద్దం అని, పీఓకేలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని, విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, భారత జమ్ముకశ్మీర్ తో పోలిస్తే పాకిస్తాన్ విద్య మీద చాలా తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. దానికి మించి భారత్ 9 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు.

పాక్ వనరులను దుర్వినియోగం చేస్తూ, ప్రజల ప్రాథమిక అవసరాలు, హక్కుల పట్ల నిర్లక్ష్యం చేస్తోందని, అక్కడి ప్రజలు పాకిస్తాన్ దయ మీద ఆధారపడి జీవించాల్సి వస్తుందని తస్లీమా ఆవేదన వ్యక్తం చేసింది. పాక్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించలేక భారత్ మీద ప్రచ్చన్న యుద్ధం చేయడానికి తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోందని వెల్లడించింది.