రే*ప్ కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ కు బిగ్ షాక్
తీర్పు వెలువడిన వెంటనే కోర్టు హాలులో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తేజ్‌పాల్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.
By: A.N.Kumar | 6 Aug 2026 4:04 PM ISTప్రముఖ జర్నలిస్టు, ‘తెహల్కా’ మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా లైంగిక దాడి కేసులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2021లో ట్రయల్ కోర్టు ఆయనకు ఇచ్చిన 'క్లీన్ చిట్' తీర్పును బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ గురువారం రద్దు చేసింది. కేవలం నిర్దోషిత్వ తీర్పును కొట్టివేయడమే కాకుండా జూనియర్ మహిళా సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
అసలు ఏం జరిగింది?
ఈ వివాదం 2013లో గోవాలో జరిగిన 'థింక్‌ఫెస్ట్' ఈవెంట్ సందర్భంగా ప్రారంభమైంది. ఒక ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్ట్‌లో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆయన వద్ద పనిచేసే జూనియర్ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గోవా క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసి తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 2021లో సుదీర్ఘ విచారణ అనంతరం గోవా ట్రయల్ కోర్టు సాక్ష్యాధారాలు సరిపోలేదని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బలమైన వాదనలు వినిపించారు. "లైంగిక దాడికి గురైన బాధితురాలు ఒక నిర్దిష్ట శైలిలోనే ప్రవర్తించాలనే ముందస్తు భావనతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రతి మహిళ స్పందన ఒక్కోలా ఉంటుంది" అని ఆయన వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన బాంబే హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పులో తీవ్ర లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. "ఒక మహిళ నో అంటే... దానికి అర్థం నో మాత్రమే.. సమాజానికి ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి ఈ తీర్పు ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లాలి" అని కోర్టు పేర్కొంది.
భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
తీర్పు వెలువడిన వెంటనే కోర్టు హాలులో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తేజ్‌పాల్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. కాగా, తనకు 62 ఏళ్లు ఉన్నాయని ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇవ్వాలని శిక్ష అమలులో కొంత ఉపశమనం కల్పించాలని తేజ్‌పాల్ అభ్యర్థించారు.
ఒకప్పుడు 2001 నాటి 'ఆపరేషన్ వెస్ట్ ఎండ్' స్టింగ్ ఆపరేషన్‌తో దేశంలో పరిశోధనాత్మక జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తరుణ్ తేజ్‌పాల్ ఈ నేరారోపణలతో తీవ్రంగా దెబ్బతిన్నారు. తాజాగా వచ్చిన ఈ తీర్పు ఆయన కెరీర్‌కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మహిళల రక్షణ , లైంగిక వేధింపుల కేసుల విచారణలో ఒక మైలురాయిగా నిలవనుంది.
